విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఎగుమతుల శాతం వృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర పోషించిన పలువురు వ్యాపారవేత్తలకు ఇండస్ట్రి చాంపియన్, ఎక్స్‌పోర్ట్ చాంపియన్ పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ…
ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి వచ్చిన వివిధ దేశాలకు చెందిన దౌత్యాధికారులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఎగుమతి దారులకు, ఎక్స్పర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్ల సభ్యులకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు, మంత్రివర్గ సహచరులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, ఇతర భాగస్వాములందరికి కూడా స్వాగతం. రెండు రోజులపాటు వాణిజ్య ఉత్సవ్ విజయవాడలో జరగబోతోంది. తర్వాత నాలుగు రోజులపాటు వివిధ జిల్లాల్లో వాణిజ్య ఉత్సవాలు జరుగుతాయి. ఈ మొత్తం వారం రోజులపాటు వాణిజ్య సంబంధిత వర్గాలన్నీ కూడా ప్రభుత్వానికి దగ్గరగా ఉంటారు. అలాగే ప్రభుత్వం కూడా వారికి దగ్గరగా ఉంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కీ అమృత్ మహాత్సవ్’లో భాగంగా వాణిజ్య ఉత్సవన్ను జరుపుకుంటున్నాం. గడచిన రెండేళ్లలో పెనుసవాళ్లను ఎదుర్కొన్నాం. ఆర్ధిక మాంద్యం కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్య ఒక సంవత్సరంలో అయితే, రెండో సంవత్సరం కోవిడి విపత్తును చూశాం. దీనివల్ల దేశవ్యాప్తంగా రెవిన్యూ వసూళ్లు 3.38శాతం పడిపోయాయి. 2018-19 మధ్యకాలంలో దేశం మొత్తం రెవిన్యూ వసూళ్లు రూ. 20,80,465 కోట్లు ఉంటే 2019-2020లో అవి రూ.20,10,059 కోట్లకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా జీడీపీ వృద్ధిరేటు 2018-19లో 6.3 శాతం ఉంటే.. అది 2019-2020 నాటికి 4 శాతానికి పడిపోయింది. తదుపరి ఏడాది మరింతగా క్షీణించి, 2020-21 నాటికి -73 (మైనస్) శాతానికి పడిపోయింది. దేశం నుంచి ఎగుమతులు కూడా బాగా పడిపోయాయి. 330 బిలయన్ డాలర్ల విలువైన ఎగుమతులు, 11.6 శాతంగా ఉన్న ఎగుమతులు… రెండేళ్ల కాలంలో 290 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దేశంలో ఎగుమతుల రంగానికి ఇది అత్యంత సంక్లిష్ట సమయం.
విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఎగుమతుల్లో వృద్ధి…
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రం నుంచి ఎగుమతులు 19.4శాతం వృద్ధిచెందాయి. 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు వృద్ధిచెందాయి. సముద్రపు ఉత్పత్తులు 15శాతం ఎగుమతులకు దోహదపడ్డాయి. షిప్, బోట్ల నిర్మాణాల రూపేణా 8.5శాతం, ఫార్మారంగం 7.3 శాతం, ఐరన్ మరియు స్టీల్ ఉత్పత్తులు 7.3 శాతం, నాన్ బాస్మతి రైస్ 4.8 శాతం ఎగుమతులకు దోహదపడ్డాయి. ఈ రంగాలన్నింటి వల్ల మొత్తంగా ఎగుమతులు 19.4శాతం పెరిగాయి.
ఎగుమతుల్లో 4వ స్థానం…
2018–19లో ఎగుమతుల విషయంలో రాష్ట్రం 9వ స్థానంలో ఉండేది. 2019-20లో 7వ స్థానానికి, 2020-21లో 4వ స్థానానికి చేరుకున్నాం . రాష్ట్ర జీఎడీపీ కూడా కోవిడ్ సంవత్సరం 2020-21లో 2.58శాతం క్షీణిస్తే… దేశ జీడీపీ 7.3శాతం క్షీణించింది.
ఈ వివరాలు ఎందుకు చెపున్నానంటే.. సరైన మౌలిక వసతుల కల్పన, చక్కటి విధానాలు ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని మా గట్టి నమ్మకం. పారిశ్రామిక ప్రగతికి, ఎగుమతుల వృద్ధికి ఈ రెండు చాలా కీలకమైనవి.
రెండేళ్లలో…
గడచిన రెండేళ్లకాలంలో మేం చాలా దూరం ప్రయాణం చేశాం. రూ.5,204 కోట్లతో 16,311 ఎంఎస్ఎంఈలు నెలకొల్పబడ్డాయి. తద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కాకుండా గడచిన రెండేళ్లలో 68 అతి భారీ, భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.30,175కోట్ల పెట్టుబడులు ఈ పరిశ్రమల ద్వారా వచ్చాయి. 46,119 మందికి ఉపాధి లభించింది.
రూ.36,384 కోట్లతో భారీ పరిశ్రమలు…
ఇదే కాకుండా రూ.36,384 కోట్ల పెట్టుబడితో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తిచేసుకోబోతున్నాయి. 76,960 మందికి ఉద్యోగాల కల్పించే సామర్థ్యం వీటికి ఉంది. గడచిన ఏడాది కాలంలోనే రూ.26,391 కోట్లతో ఏర్పాటు చేయనున్న 10 మెగా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం . వీటివల్ల 55,024 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం – ఏపీ…
దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే. విశాఖపట్నం-చెన్నై, చెన్నై – బెంగుళూరు, హైదరాబాద్- బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తిస్తాయి. ఆర్థిక వృద్ధిరేటును పెంచడమే కాదు, పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తాయి.
మెగా ఇండస్ట్రియల్ హబ్ కొప్పర్తి …
రాష్ట్ర ప్రభుత్వం వైయస్సాల్లాలో కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబన్ను అభివృద్ధి చేస్తోంది. 3,155 ఎకరాల్లో మల్టీ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్తు, నీళ్లు, ఎసీపీలు లాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం . రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే దిశగా అడుగులేస్తున్నాం . దాదాపు లక్ష మందికి పైగా ఉపాధి కల్పించే సమర్థత ఈ పార్కుకు ఉంది. ఇదే ఇండస్ట్రియల్ పార్కులో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం . 800 ఎకరాల్లో రూ.1730 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నాం . దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. తద్వారా 25వేలమందికి ఉద్యోగాల కల్పనా సామర్థ్యం ఈఎంసీకి ఉంది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్టీల్ ఉత్పత్తులకు పెరిగిన గిరాకీ దృష్ట్యా 3మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడప జిల్లాలో స్టిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నాం . రూ.13,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీ రాబోతోంది.
గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్- గెయిల్ భాగస్వామ్యం…
సిరమైన పారిశ్రామిక ప్రగతికోసం అవసరాలకు సరిపడా ఇంధన వనరులు అందుబాటులో ఉండడం చాలా కీలకం. సరిపడా గ్యాస్ లభ్యం కావాలి. పరిశ్రమలకోసం, గృహ అవసరాల కోసం గ్యాసన్ను అందుబాటులో ఉంచడానికి గెయిల్ భాగస్వామ్యంతో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయబోతున్నాం. అతి తక్కువ ఖర్చు కాగల ఇంధన వనరులను అందుబాటులోకి తీసుకురావడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం.
26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు…
దీంతోపాటు నైపుణ్య లేమిని తీర్చడానికి ప్రపంచస్థాయిలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కోటి చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతిలలో ఒక స్కిల్ యూనివర్శిటీని, ఒక స్కిల్ యూనివర్శిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. ఒక యూనివర్శిటీ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో నైపుణ్యాలను అభివృద్ధిచేయడంపై దృష్టిపెడితో మరో యూనివర్శిటీ ఐటీరంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి దృష్టి పెడుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థుల నైపుణ్యాలను ఈ కాలేజీలు మెరుగుపరుస్తాయి. వారికి ఉద్యోగాల కల్పన దిశగా నడిపిస్తాయి. దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో 5.8శాతం రాష్ట్రం నుంచే జరుగుతున్నాయి. 2030 నాటికి 10శాతం ఎగుమతులు రాష్ట్రం నుంచే జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగానే మేం అడుగులు వేస్తున్నాం. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి సమగ్రమైన మార్గదర్శక ప్రణాళిక కూడా వేసుకున్నాం .
కొత్త పోర్టుల నిర్మాణం…
రాష్ట్రానికి 974 కి.మీ. తీర ప్రాంతం ఉంది. ఎగుమతులు వృద్ధి చెందడానికి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. మరో మూడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు, ప్రకాశం జిల్లా రామాయపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పోర్టులను నిర్మిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ పోర్టులు సమీపంలో ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు తెలంగాణకు, రామాయపట్నం తమిళనాడుకు, భావనపాడుకు ఉత్తరాది రాష్ట్రాలు సమీపంలో ఉన్నాయి. విదేశీ వాణిజ్యాన్ని పెంచడంలో ఈ పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయి. పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరుగుతుంది. పోర్టులు ద్వారా రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతులు కలిపి ఏడాదిలో సుమారు 254 మిలియన్ టన్నులుగా ఉంది. మూడు కొత్త పోర్టుల వల్ల మరో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణా మొదటి దశలో వృద్ధి చెందుతుంది.
25 సెకండరీ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లు…
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 25 సెకండరీ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల రైతులకు మంచి ధరలు రావడమే కాదు, వ్యయసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. దీనివల్ల ప్రత్యక్షంగా 30వేల మందికి, పరోక్షంగా 50 వేలమందికి ఉద్యోగావకాశాలు వస్తాయి.
8 కొత్త ఫిషింగ్ హార్బర్లు…
దీంతోపాటు మరో 8 ఫిషింగ్ హార్బర్లను కూడా నిర్మిస్తున్నాం. మా రాఫ్రానికి చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్
వెళాల్సిన పరిస్థితి. ఇంత పెద్ద సముద్రతీర ప్రాంతం ఉన్నా, హార్బర్లు లేకపోవడంల్ల మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2 విడతల్లో 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం . రూ.3,827 కోట్లు ఖర్చుచేస్తున్నాం. 76,230 మంది మత్స్యకారులు లబ్ది పొందడమే కాదు, మరో 35వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఐప్లాంట్లు, కోలు స్టోరేజీలు, చేపలు, మరియు రొయ్యల ప్రాససింగ్, మార్కెటింగ్ వస్తాయి. తద్వారా ఎగుమతులు పెరగడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ కష్టకాలంలో పారిశ్రామిక వేత్తలు చూపిస్తున్న అంకిత భావానికి, ఎగుమతిదారులకు, వాణిజ్య మండళ్లకు, శ్రమిస్తున్న కార్మికులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వాణిజ్య ఉత్సవానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. పారిశ్రామిక వేతలో ఈ వాణిజ్య ఉత్సవ్ మరింత నమ్మకాన్ని కల్పిస్తుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా, ఏపీతో పాటు వృద్ధిచెందేలా మరింత మందిని పోత్సహిస్తుంది.
ఎలాంటి సహాకారం కావాలన్నా సిద్ధం…
ఎలాంటి సహకారం కావాలన్నా మేం అందుబాటులో ఉంటాం. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్నారు. మేం చేయాల్సినవి ఏమైనా ఉంటే.. మాకు సూచనలు చేయండి… కచ్చితంగా వాటిని చేస్తాం అని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ ధర్మాన కృష్ణదాస్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు వాణిజ్య వేత్తలు పాల్గొన్నారు.