-లోతట్టు ప్రాంతాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటించారు. కుండపోత వర్షానికి మునిగిన ప్రాంతాలను మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ లతో కలిసి సందర్శించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు కండ్రికలో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు అధికారుల ద్వారా సాయం అందించారు. లోతట్టు ప్రాంతాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బోస్ నగర్, ఎల్బీ నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్ లలో నీరు నిలిచిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కండ్రిక డీపీ స్టేషన్ ద్వారా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు 33 తూముల్లోకి పారే విధంగా చూడాలన్నారు. నీటమునిగిన ప్రాంతాల నుంచి వర్షపునీటిని తగినన్ని మోటార్ల సాయంతో బయటకు పంపించే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి నగర కమీషనర్ తో చర్చించారు. అదేవిధంగా వర్షపునీరు రోడ్లపై నిల్వ ఉండకుండా డ్రెయినేజీలలో చెత్తను తొలగించాలని మల్లాది విష్ణు అన్నారు. ప్రతి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. నూజివీడు రోడ్డు మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు భారీ వర్షాలకు ఏవీఎస్ రోడ్డు, మాకినేని బసవపున్నయ్య స్టేడియం రోడ్డు, ఉడా కాలనీ సహా పలు ప్రాంతాలలో పడిపోయిన చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితి మెరుగుపడే వరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మల్లాది విష్ణు గారు అన్నారు. ఎమ్మెల్యే గారి వెంట ఈఈ శ్రీనివాస్, వీఎంసీ అధికారులు, అన్ని శాఖల సిబ్బంది, వైఎస్సార్ సీపీ నాయకులు యర్రగొర్ర శ్రీరాములు, మోదుగుల గణేష్, అలంపూర్ విజయ్ తదితరులు ఉన్నారు.