-గవర్నర్ తో భేటీ అయిన జాతీయ సఫాయి కర్మచారి కమీషన్ ఛైర్మన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో సఫాయి కర్మచారి కమీషన్ ఏర్పాటుకు సహకరించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు జాతీయ సఫాయి కర్మచారి కమీషన్ అధ్యక్షుడు ఎం.వెంకటేశన్ విన్నవించారు. బుధవారం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కమీషన్ అధ్యక్షుడు సమకాలీన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వెంకటేశన్ మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాలలో సఫాయి కర్మచారి కమీషన్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కాలేదని గవర్నర్ హరిచందన్ కు వివరించారు. రాష్ట్ర విభజన తదుపరి ఎపిలో కమీషన్ ఏర్పాటు కావలసి ఉన్నప్పటికీ ఆ ఏర్పాటు జరగలేదని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.