-తాడేపల్లిలోని పిఆర్&ఆర్డీ కమిషనర్ కార్యాలయం నుంచి వైయస్‌ఆర్ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛసంకల్పంపై జిల్లా కలెక్టర్లు, జెసి, డ్వామా పిడిలతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్
-అక్టోబర్ 7వ తేదీన వైయస్‌ఆర్ ఆసరా రెండో విడత చెల్లింపు
-మొత్తం 8,00,042 సంఘాలకు లబ్ధి
-78,75,599 మంది మహిళలకు ప్రయోజనం
-రెండో విడత కింద రూ.6570.76 కోట్లు చెల్లింపు
-సీఎం వైయస్ జగన్ చేతుల మీదిగా మహిళల ఖాతాలకు సొమ్ము జమ
-ఎస్‌హెచ్‌జి మహిళల వ్యక్తిగత ఖాతాలకే ఆసరా సొమ్ము
-ప్రతి నియోజకవర్గంలోనూ పదిరోజుల పాటు ఆసరా కార్యక్రమాలు
-అక్టోబర్ 2న విజయవాడలో క్లాప్, జగనన్న స్వచ్ఛ సంకల్పం
-విజయవాడలో ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్
-వంద రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్లాప్, జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలు
-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని 78,75,599 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు వైయస్‌ఆర్ ఆసరా (రెండో విడత) కార్యక్రమాన్ని అక్టోబర్ 7వ తేదీన సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామ సచివాలయాల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పిఆర్ & ఆర్డీ కమిషనర్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలు, డ్వామా, డిఆర్‌డిఎ పిడిలతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా వైయస్‌ఆర్ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు.
వీడియో కాన్ఫెరెన్సెలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఎన్నికలకు ముందు వరకు అంటే 2019 ఏప్రిల్ 11వ తేదీ వరకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అధికారంలోకి వస్తే ప్రభుత్వమే భరిస్తుందన్న మాటను సీఎం వైయస్ జగన్ నిలబెట్టుకుంటున్నారని అన్నారు. దీనిలో భాగంగా అప్పటి తేదీ వరకు ఉన్న 25,579 కోట్ల రూపాయల రుణాలను నాలుగు విడతల్లో స్వయం సహాయక మహిళలకు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే మొదటి విడత కిందగత ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన 78,08,101 మంది మహిళలకు రూ.6330.58 కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు. ఈ ఏడాది రెండో విడత కింద దాదాపు 8 లక్షల స్వయం సహాయక బృందాలకు మేలు చేసేందుకు మొత్తం 78,75,599 మంది మహిళలకు రూ.6470.76 కోట్ల రూపాయలను వారి ఖాతాలకు జమ చేయబోతోందని అన్నారు. అక్టోబర్ ఏడో తేదీన క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి ఈ మొత్తాలను మహిళల ఖాతాలకు జమ చేస్తారని తెలిపారు. జిల్లాల్లో అక్టోబర్ 8వ తేదీన వైయస్‌ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ఆయా జిల్లాల ఎంపి, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో పదిరోజుల పాటు వైయస్‌ఆర్ ఆసరా రెండో విడత చెల్లింపు కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించాలని, అందులో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ పదిరోజుల్లో మహిళల్లో వ్యాపార అవకాశాలపై అవగాహన పెంచడం, ఉపాధి మార్గాల పై చైతన్యం కలిగించడం, బ్యాంకుల ద్వారా రుణాల పొందేలా చూడటం, మార్కెటింగ్ అవకాశాలను వివరించడం వంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే పలు కార్పోరేట్ కంపెనీలతో మహిళలు ఉపాధి, వ్యాపార కార్యకలాపాల కోసం ఒప్పందాలు చేసుకున్నారని, విజయవంతంగా నిర్వహిస్తున్న వ్యాపారాలపై సక్సెస్ స్టోరీలు రూపొందించి, మిగిలిన వారికి స్పూర్తిని కలిగించాలని కోరారు.
అక్టోబర్ 2న క్లాప్, జగనన్న స్వచ్ఛసంకల్పం ప్రారంభం…
ఆరోగ్యవంతమైన గ్రామసీమలే లక్ష్యంగా క్లాప్, జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీన సీఎం చేతుల మీదిగా ప్రారంభమవుతోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారని వెల్లడించారు. గ్రామ పంచాయతీల స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలకు అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా సమకూరుస్తోందని అన్నారు. జగనన్న స్వచ్ఛసంకల్పం విజయవంతం కావాలంటే దానిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి వంద రోజుల పాటు ఒక ఉద్యమంగా గ్రామస్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపిపి, ఎంపిటిసి, జెడ్పీటిసి, జెడ్పీ చైర్మన్‌లను కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలని అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారయంత్రాంగం సిద్దంగా ఉండాలని అన్నారు. గ్రీన్‌గార్డ్స్, అంబాసిడర్లను అవసరంను బట్టి నియమించుకోవాలని అన్నారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రతా పక్షోత్సవాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని, తమ గ్రామాలను శుభ్రంగా ఉంచుకునేందుకు నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలకు తమవంతుగా విరాళాలు కూడా అందచేశారని అన్నారు. కొత్తగా పంచాయతీ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు సభ్యులు ఎన్నికైన నేపథ్యంలో వారి సహకారంతో మరింత సమర్థంగా పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు, మంచినీరు, పచ్చదనం వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో పిఆర్&ఆర్డీ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సిఇఓ ఇంతియాజ్, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ఎండి సంపత్ కుమార్, నరేగా డైరెక్టర్ చిన్నతాతయ్య, వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు, జెసిలు, డిఆర్‌డిఎ పిడి, డ్వామా పిడిలు పాల్గొన్నారు.