-ప్రభుత్వ వ్యవస్థలను అనుసందానిస్తూ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పాన్ ఇండియా అవేర్ నెస్ అండ్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డిఎన్ఎస్ఎ స్టాల్‌ను జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి. రామకృష్ణ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటికీ చాలా వరకు ప్రజలు న్యాయస్థానాలకు ఏవిధంగా రావాలి వారికి ఏదైన అన్యాయం జరిగితే ఏవిధంగా న్యాయం పొందాలి తెలుసుకోలేక ఉన్నారని అట్టి వారికి చట్టాల గురించి న్యాయ వ్యవస్థ గురించి కరపత్రాల ద్వారా, పుస్తకాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు, చదువుకున్న వారికైతే న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి వారిని చైతన్యవంతం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల ముంగిటకే న్యాయం అంశం ఆధారంగా జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధి కార సంస్థల ఆదేశాల మేరకు జిల్లాలో కోర్టులు ఉన్న అన్ని ప్రదేశాల్లో జిల్లా మరియు మండల సేవాధి కార సంస్థ కమిటీలతో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో స్పందన నిర్వహించి అర్జీలు తీసుకోవడం, వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం పరిపాటి, స్పందనలో న్యాయ సంబంధమైన అంశాలు ఇమిడి ఉన్న సమస్యలు లోక్ అదాలత్ లకు లేదా రెగ్యులర్ కోర్టులకు పంపడం జరుగుతూ ఉంటుందన్నారు. ఈ శ్రమ కూడా ప్రజలకు లేకుండా స్పందనలో ఈ రోజు లీగల్ సెల్ ప్రారంభించినట్లు, ఈ సెల్ లో పారాలిగల్ వాలంటీర్ ప్యానల్ అడ్వకేట్ ఇక్కడ ఉండి స్పందనలో న్యాయసంబంధమైన అంశాలు ఇమిడి ఉన్న వాటిని స్వీకరించి వారికి న్యాయపరమైన సూచనలు, సలహాలు అందజేయడంతో పాటు వాటిని ప్రాసెస్ చేసి ప్రీలిటికేషన్ కేసులుగా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పరిష్కారం చూపడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు ఉదాహరణకు రెవిన్యూ, న్యాయ, పోలీసు వంటి శాఖలను అనుసందానిస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం లేదా తప్పుడు ఆరోపణలు చేస్తే అట్టి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎన్ఎ కార్యదర్శి పి. జయరామ్, జాయింట్ కలెక్టర్ రెవిన్యూ డా. కె. మాధవీలత, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి,డ డిఎస్ పి మాసుం భాషా తదితరులు పాల్గొన్నారు.