మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధార్ నవీకరణ కష్టాలు సాంకేతిక సమస్యలు ఓ దివ్యాంగుడి పింఛన్ పై తీవ్ర ప్రభావం చూపింది. వేలిముద్రలు సరిగా పడలేదన్న కారణంగా నిలిచిపోయిన పింఛన్ ను జిల్లా కలెక్టర్ జె నివాస్ పెద్ద మనస్సుతో చొరవ చూపి పునరుద్ధరించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో నిరుపేద తల్లితండ్రులు తమ పుత్రుడికి కల్గిన కష్టాన్ని జిల్లా కలెక్టర్ వద్ద విన్నవించుకొన్నారు. వాసే వాసు (12) పుట్టుకనుంచి దివ్యాంగుడని, గతం నుంచి మంజూరై వస్తున్న పింఛన్ ను ఇటీవల వేలిముద్రలు పడటం లేదనే కారణంతో కొందరు అధికారులు రెండు నెలల నుంచి పింఛన్ నిలిపివేశారని పేర్కొన్నారు. కైకలూరు మండలం వేమవరపాడు గ్రామానికి చెందిన వాసే సుకన్య స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఈ సమస్యపై ఒక అర్జీ సమర్పించింది. అందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ మానవీయ కోణంలో యోచించి తక్షణమే ఆ దివ్యాంగుడి పింఛను పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని డి.ఆర్.డి.ఎ పిడి ని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మంగళవారం వాసుకి వేమర్పాడు గ్రామంలోనే గ్రామ వాలంటీర్ ద్వారా పింఛను అందజేశారు. తమ సమస్యపై గంటల వ్యవధిలోనే స్పందించి పింఛన్ తిరిగివచ్చేలా సహాయం చేసిన ఉన్నతాధికారి ఉత్తమ గుణానికి వాసే వాసు తల్లిదండ్రులు సుకన్య, నాగయ్యలు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తమ బిడ్డ పట్ల ఎంతో కనికరం చూపి ఆదుకొన్నందుకు జిల్లా కలెక్టర్ కి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. స్పందన కార్యక్రమానికి సోమవారం తెల్లవారు జామునే వచ్చిన తమకు కలెక్టర్ స్పందించి పరిష్కరించారన్నారు.
Tags machilipatnam
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …