-అయ్యన్నా.. స్థాయి మరిచి మాట్లాడకు
-బషీర్ బాగ్ మారణహోమాన్ని మార్చిపోయారా..?
-విద్యుత్ రంగంపై భారం మోపిందే చంద్రబాబు
-ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షం యత్నాలు
-దేశంలో ఏపీలోనే అతి తక్కువ ఛార్జీలు
-గత సర్కారు విద్యుత్ వ్యవస్థను భ్రష్టుపట్టించింది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను మల్లాది విష్ణు ఒక ప్రకటనలో ఖండించారు. ప్రతిపక్షంలో కూర్చున్నా అయ్యన్నపాత్రునికి అధికార దర్పం తగ్గలేదన్నారు. అయ్యన్న నీతి మాటలు వింటే దెయ్యాలు గుర్తుకు వస్తున్నాయని.. కోట్ల రూపాయలు అక్రమాస్తులు గడించిన అయ్యన్న బండారం అందరికీ తెలుసన్నారు. రంగు రాళ్ల నుంచి క్వారీ బండరాళ్ల వరకు దేనిని వదల్లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. అనుకుల మీడియా సపోర్టుతో నిత్యం వార్తల్లో ఉండాలనే దుగ్థతో లోకేశ్ ఇచ్చిన స్క్రిప్ట్ ను గుడ్డిగా చదువుతున్నాడన్నారు.
విద్యుత్ రంగాన్ని అప్పుల్లో ముంచిందే చంద్రబాబు
టీడీపీ సర్కారు విద్యుత్ వ్యవస్థను నష్టాల ఊబిలోకి గెంటేసి జెన్‌కో, ట్రాన్స్ కో, డిస్కంలను కోలుకోలేని రీతిలో అప్పుల్లో ముంచేసిందని మల్లాది విష్ణు అన్నారు. పెద్ద ఎత్తున బకాయిలను మిగల్చడమే కాకుండా అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేసిందన్నారు. యూనిట్ విద్యుత్ రూ.2 దొరికే చోట రూ.4.83 పైసలకు చంద్రబాబు కొనుగోలు చేశారని గుర్తుచేశారు. ఆయన చర్యలతో రాష్ట్రంపై వేల కోట్ల రూపాయలు భారం పడిందన్నారు. గతంలో 4 వేల మెగావాట్లకు బాబు యూనిట్‌కు సుమారు రూ.7 వరకు అగ్రిమెంట్ చేసుకున్నారని.. 4 వేల మెగావాట్లకు మా ప్రభుత్వం యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు అగ్రిమెంట్ చేసుకుని కొనుగోలు ధరను గణణీయంగా తగ్గించామన్నారు.
చార్జీలు ఏపీలోనే చౌక
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే గృహ విద్యుత్ టారిఫ్ తక్కువని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా 50 యూనిట్ల వరకు వినియోగించే పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సబ్సిడీతో విద్యుత్ అందిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఉన్నంత అతి తక్కువ విద్యుత్ టారిఫ్ మరే రాష్ట్రాల్లోనూ లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. జల విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తై, తక్కువ ధరకే విద్యుత్ లభించే ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ తరహాలో తక్కువ ధరలకు విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. వైఎస్‌ఆర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతుకు ఫ్రీ పవర్ అనే ఆలోచన చేసింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. రైతుకు ఉచితంగా విద్యుత్ అందిస్తానని వైఎస్సార్ చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ.. ఆక్వా, నర్సరీలు, దోబీఘాట్‌లు, సెలూన్లు, స్వర్ణకారులతోపాటు ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ రాయితీలు కల్పిస్తున్నారన్నారు. ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు సకాలంలో చెల్లిస్తోందన్నారు.
బషీర్ బాగ్ మారణహోమం మర్చిపోయారా..?
బషీర్ బాగ్ కాల్పులు జరిగి 21 ఏళ్ళు అయ్యినా.. నేటికి ఆ చీకటి రోజును ప్రజలు మర్చిపోలేదని మల్లాది విష్ణు అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించమన్న వారిపై చంద్రబాబు దుర్మార్గంగా కాల్పులు జరిపించారని.. ఈ కాల్పుల్లో ముగ్గురు అమరులు కాగా ఎంతోమంది విద్యార్థులు క్షతగాత్రులు అయ్యారన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు.
గత సర్కారు నిర్వాకాలకు ఈ లెక్కలే రుజువు…
గడిచిన ఐదేళ్ల చంద్రబాబు పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నష్టాల్లోకి నెట్టబడిందని మల్లాది విష్ణు అన్నారు. 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏపీఎస్పీడీసీఎల్ రూ.12,539 కోట్లు నష్టంలోనూ, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.7,745 కోట్ల నష్టంలోనూ ఉన్నాయని తెలిపారు. మరోవైపు.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటికి రూ.12,500 కోట్లు వున్న కొనుగోలు బకాయిలు, నిర్వహణ వ్యయ రుణాలు 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరుకున్నాయన్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే గత ప్రభుత్వ సమర్ధత ఏపాటిదో అర్థం అవుతుందన్నారు.
విద్యుత్తు కొనుగోళ్లలో రూ.2,342 కోట్లు ఆదా
విద్యుత్తు కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.2,342 కోట్లకుపైగా ఆదా చేసిందని నీతి ఆయోగ్, ఆర్‌ఎంఐ సంస్థ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. 2019–21 మధ్య రెండేళ్లలో విద్యుత్తు కొనుగోళ్లలో స్వీయ నియంత్రణ పాటించడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. కనుక విద్యుత్ రంగంపై మాట్లాడే నైతిక అర్హత అయ్యన్నకు కానీ, తెలుగుదేశం తొత్తులకి కానీ లేదని మరోసారి స్పష్టం చేశారు.