విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం నిర్వహించే హంస వాహన తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవానికి చేపట్టిన ఏర్పాట్లపై ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్, మత్స్య శాఖ, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో గురువారం ఇరిగేషన్ మోడల్ గెస్టుహౌస్లో జిల్లా కలెక్టర్ జె. నివాస్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది తెప్పోత్సవాన్ని దుర్గాఘాట్లో గత ఏడాదిలాగే నిలకడగానే హంసవాహనంపై నిర్వహించేలా దేవాదాయ, ఆగమ నియమనిబంధనలు, జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సాయంత్రం 5.30 గంటలకు పవిత్ర కృష్ణానదిలో ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించి హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు. తెప్పోత్సవం నిర్వహించే దుర్గాఘాట్లో భక్తులను అనుమతించడం జరగదన్నారు. ఎగువున కురిసిన వర్షాల వల్ల లక్షకు పైగా క్యూసెక్కుల వరదనీరు ప్రకాశం బ్యారేజికి చేరుకుంటుందన్నారు. రామన్న రెండు రోజులపాటు ఇదే వరద ఉదృతి కొనసాగుతుందని కలెక్టర్ అన్నారు. నవరాత్రి 8 రోజులు భక్తులు సహకరించారని శుక్రవారం విజయదశమిరోజు కూడా ఇదే స్పూర్తితో నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు… : కలెక్టర్ జె.నివాస్
నవరాత్రి ఉత్సవాలలో విజయవంతం చేయడంలో మీడియా మిత్రులు జిల్లా యంత్రాంగానికి సహకరించి ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారన్నారు. ఉత్సవాలలో భక్తులకు ఎదురైన చిన్నచిన్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చి సహకరించారని ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కలెక్టర్ అన్నారు.
నగర పోలీస్ కమీషనర్ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ రేపు అనగా విజయదశమి శుక్రవారం రోజు భక్తుల రద్దీ మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించే తెప్పోత్సవ కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. దీనిలో భాగంగా కనకదుర్గా ప్లై ఓవర్ పై ట్రాఫిక్ను నిలుపుదల చేస్తున్నామన్నారు. దుర్గాఘాట్ నుండి కుమ్మరిపాలెం జంక్షన్ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. ఘాట్ లో అనుమతి ఉన్న వారికే ప్రవేశం ఉంటుందన్నారు. ప్రకాశం బ్యారేజిపై పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని నగర పోలీస్ కమీషనర్ కోరారు. నవరాత్రి ఉత్సవాలు విజయవంతానికి కృషి చేసిన పోలీస్ యంత్రాంగానికి సిటీపోలీస్ తరపున దన్యవాదాలు తెలిపారు.
పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్లు కె. మాధవీలత, ఎస్. శివశంకర్, కె. మోహన కుమార్, మున్సిపల్ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్, ఆలయ ఇవో డి. భ్రమరాంబ ఉన్నారు.