తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన “బాల్ వివాహ్ ముక్తి రథ్” కార్యక్రమానికి మద్దతు కోరుతూ సంస్థ ప్రతినిధులు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం మరియు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న 100 రోజుల సుదీర్ఘ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోందని వారు వివరించారు.
జిల్లాలో 30 రోజులపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అవగాహన రథం ద్వారా బాల్య వివాహాల దుష్పరిణామాలు, చట్టపరమైన చర్యలు, బాలల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు అధికంగా ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఎంపీకి వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, “బాల్య వివాహం ఒక సామాజిక అనర్థం మాత్రమే కాదు, అది బాలల భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సమస్య. ప్రతి బాలికకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం మనందరి బాధ్యత. 2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరం. ఈ కార్యక్రమానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు.
Prajavartha Online Telugu News