-వెదురుపావులూరు, సూరంపల్లి, నున్న ప్రాంతాలలోని లే ఔట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీల లే ఔట్ల అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అధికార్లను ఆదేశించారు. వెదురుపావులూరు, సూరంపల్లి, నున్న ప్రాంతాలలోని లే ఔట్లను శనివారం అధికార్లతో కలిసి జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు పధకం కింద విజయవాడ నగర పరిధిలోని నిరుపేదలకు ఈ ప్రాంతాలలో స్థలాలు కేటాయించడం జరిగిందని, జగనన్న ఇళ్ల కాలనీలలో లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకునేందుకు అనుకూలమైన పరిస్థితులను కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణ మెటీరియల్స్ నిర్మాణ ప్రాంతం వరకు వెళ్లే విధంగా రోడ్లు సౌకర్యం కల్పించాలన్నారు. నిర్మాణ సమయంలో కట్టడాలకు నీటి సౌకర్యం అవసరం అవుతుందని, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను లబ్దిదారులకు ఉచితంగా అందిస్తున్నామని, ఇసుక సరఫరాలో ఎటువంటి కొరత రాకుండా చూడాలన్నారు. అంతేకాక సిమెంట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రిని సబ్సిడీ పై లబ్దిదారులకు అందిస్తున్నామని, వీటి సరఫరాలో ఎటువంటి కొరత లేకుండా తగినన్ని నిల్వలు ఉంచుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించినప్పుడే ఇళ్ళ నిర్మాణ ప్రగతి వేగవంతం అవుతుందని, అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీల లే అవుట్ లలో మౌలిక సదుపాయాలను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలనీ జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట నూజివీడు రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి, తహసిల్దార్ నరసింహారావు, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.