-ఓటర్లు తమ ఓటు హక్కు నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాట్లు..
-జిల్లా కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పై జిల్లా కలెక్టర్ జె. నివాస్ సంబంధిత జిల్లా అధికారులు, ఎన్నికల అధికారులతో టేలికాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ నెల 14న ఐదు సర్పంచ్, 41 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది.అదే రోజు ఓట్ల లెక్కింపు చేస్తారు. ఈ నెల 15న జగ్గయ్యపేట, కొండపల్లి మునిసిపాలిటీ లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 17న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 16న పెడన,విస్సన్నపేట, జి.కొండూరు మూడు జడ్పీటీసీస్థానాలకు,7 ఎంపిటిసి స్థానాలకు పొలింగ్ నిర్వహిస్తారు.ఈ నెల 18న ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఎన్నికల నిర్వహణ పై సంబంధించిన అధికారులకు దిశ నిర్దేశం చేస్తూ ఈ నెల 14,15,16 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ స్వేచ్ఛయుత వాతావరణం లో ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణ లో ఎక్కడ అలసత్వానికి తావులేకుండా పూర్తి జాగ్రత్తలతో విధులు నిర్వహించాలన్నారు.ఎటువంటి విమర్శలకు తావుఇవ్వకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. బ్యాలట్ బాక్స్ లు ,ఎన్నికల సామాగ్రి తరలింపు లో ,కౌంటింగ్ ఏర్పాట్లు పటిష్టం గా ఉండాలన్నారు. పోలింగ్ కు వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలన్నారు.ఇందుకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచాలని డియంహెచ్ఓ ను ఆదేశించారు.పోలింగ్ ప్రక్రియ లో సూక్ష్మ పరిశీలకులు ఏంతో కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓటింగ్ విషయంలో తిరస్కరించే సమయంలో తొందరపాటుచర్యలు వద్దని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలన్నారు.ఎన్నికల నిర్వహణ లో పోలీస్ యంత్రాంగం తో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎల్.శివశంకర్, కె.మోహన్ కుమార్,శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్,జడ్పీ సీఈఓ సూర్యప్రకాశరావు, సబ్ కలెక్టర్ జి.ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్,మునిసిపల్ కమిషనర్లు,తహశీల్దార్లు,యంపీడిఓ లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News