-సీఆర్‌డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే మాట్లాడుతా : నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు త్వరితగతిన పరిష్కారం చూపే దిశలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు సానుకూలంగా ఉన్నారని పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేసారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై సీఆర్‌డీఏ కమిషనర్‌తో పాటు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే మాట్లాడి హౌసింగ్ స్కీమ్‌పై తగిన కార్యాచరణ చేపడతామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో ఆయన ఆలోచనల మేరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళతామని వివరించారు.
బుధవారం విజయవాడ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు నారాయణను కలిసారు. సొసైటీ సభ్యుల గృహ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ అంశాలను వివరించారు. సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ జనరల్ నుంచి పొందిన న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని మంత్రికి సమర్పించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 107, దాని అమలుకు సంబంధించిన విధివిధానాలు, హౌసింగ్ స్కీమ్‌పై తొలిగిపోయున న్యాయపరమైన అపోహలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించి జారీ అయిన అన్ని జిఓలను పురపాలక పట్టణాభివృద్ది శాఖే విడుదల చేసిందని, ప్రస్తుతం అమలు బాధ్యత కూడా ఆ శాఖపైనే ఉందని పత్రికా ప్రతినిధులు నారాయణ దృష్టికి తీసుకువెళ్లారు.
సొసైటీ ప్రతినిధుల వివరాలను విన్న మంత్రి నారాయణ…ఈ అంశాన్ని సంబంధిత అధికారులతో వెంటనే చర్చించి ముందుకు తీసుకెళ్లతామని స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ కమిషనర్‌తో మాట్లాడటంతో పాటు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శితో కూడా చర్చిస్తానని తెలిపారు. పాత్రికేయిల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, తమది జర్నలిస్టు స్నేహపూర్వక ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమని నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణం వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారి సంక్షేమానికి సంబంధించిన అన్ని అంశాలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ అంశంపై గతంలోనే మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్ సొసైటీ ప్రతినిధులతో జరిపిన చర్చల్లో సానుకూల వైఖరి వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లే అవకాశాలను వారు వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలకు కొనసాగింపుగా మంత్రి నారాయణ తాజాగా ఇచ్చిన హామీతో సీఆర్‌డీఏ స్థాయిలో తదుపరి ప్రక్రియ కదలికలోకి వస్తుందనే ఆశాభావం సొసైటీ ప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ స్కీమ్‌కు ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం లభిస్తుందని వారు ఆశిస్తున్నారు.
మంత్రి నారాయణను కలిసిన వారిలో అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల నాగ శ్రీనివాస్, వ్యవస్థాపక కార్యదర్శి చావా రవి,ది పయనీర్ చీఫ్ ఆఫ్ బ్యూరో డాక్టర్ రవి కుమార్ బొప్పన, ది హిందూ డిప్యూటీ ఎడిటర్ తిరువాయిపాటి శ్రీనాథ్, హన్స్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ శ్యామ్ సుందర్,ఆంధ్ర ప్రభ చీఫ్ ఆఫ్ బ్యూరో నేరెళ్లకుంట గోపి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ మల్లేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు కృష్ణారావు, రామకృష్ణ (ఢిల్లీ) పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News