-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.
-మందులు, అంబులెన్సుల విషయంలో ముందస్తు చర్యలు చేపట్టాలి
-వైద్యులు, సిబ్బంది సెలవులు రద్దు … కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-గర్భిణులు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు అవసరం
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాలు, వరదల కారణంగా జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్య బృందాలు, మందులు, పరీక్షా పరికరాలు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ మేరకు అధికారులతో చర్చించిన సందర్భంగా బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, ఏలూరు, పార్వతీపురం మన్యం, ఎస్‌పీఎస్ నెల్లూరు, మార్కాపురం, కాకినాడ, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వర్ష ప్రభావిత, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రతి ప్రభావిత ప్రాంతంలో వైద్యాధికారి, పర్యవేక్షణ సిబ్బంది, ప్రజారోగ్య సిబ్బంది ఉండేలా చూడాలని ఆదేశించారు. అవసరమైన మందులు, పరీక్షా సామగ్రి తగినంతగా నిల్వ చేసుకోవాలని సూచించారు.
తాగునీరు.. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
వర్షాలు, వరదల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అవసరమైన చోట క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయడంతో పాటు నీటి వనరులకు క్లోరినేషన్ చేయాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందేలా చూడాలని ఆదేశించారు. సదరు ప్రభుత్వ శాఖలతో కలిసి నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని, ఇళ్లు, పాఠశాలలు, సహాయ శిబిరాలు, బహిరంగ ప్రదేశాల్లో దోమలు పెరగకుండా చూడాలని సూచించారు. మున్సిపల్, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని పారిశుద్ధ్య, దోమల నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఆసుపత్రుల్లో జపరేటర్లను సిద్ధం చేయాలి
విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో జనరేటర్లు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. రహదారులు దెబ్బతిన్నా అత్యవసర వైద్య సేవలు కొనసాగేందుకు కనీసం రెండు అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వరదలు, ఇతర ప్రమాదాల నుంచి రక్షించిన వారికి వెంటనే వైద్యం అందించాలని తెలిపారు.
గర్భిణిలు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు అవసరం
వారం రోజుల్లో ప్రసవమయ్యే అవకాశం ఉన్న గర్భిణిలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో టీకాలను సురక్షితంగా నిల్వ చేసే ఏర్పాట్లను పరిశీలించాలని తెలిపారు. వరద నీరు తగ్గిన వెంటనే దోమల లార్వా పెరిగే ప్రాంతాలను గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కాలువలు, నీటి గుంటలు, గుంతలు, నీరు నిలిచే ఇతర ప్రదేశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మలేరియా ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలు, తీర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, వరద ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అసాధారణంగా కేసులు పెరిగినా, ఒకే ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదైనా, మందులు లేదా సిబ్బంది కొరత ఏర్పడినా సాధారణ నివేదిక కోసం వేచి ఉండకుండా వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. తుఫాను సమయంలోనే కాకుండా వర్షాలు, వరదలు తగ్గిన తర్వాత కూడా కొంతకాలం ప్రత్యేక చర్యలు కొనసాగించాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
వైద్యుల సెలవులు రద్దు.. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తుఫాను పరిస్థితుల నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది సెలవుల రద్దు చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ చక్రధర్‌బాబు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు నివేదించారు. అలాగే ఇతర చర్యల గురించి వివరించారు. వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. అలాగే పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రికి చక్రధర్‌బాబు తెలిపారు.
Prajavartha Online Telugu News