-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ
-మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు శాఖల సమన్వయంతో చర్యలు
-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
-ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా డ్రగ్ మెనేస్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణ అనే మూడు అంశాలను సమగ్ర విధానంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది
-జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ‘ఆపరేషన్ త్రిశూల్’ లో భాగంగా గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, మహిళలు మరియు పిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి రోడ్డు భద్రత, డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను జిల్లా కలెక్టర్, ఎస్పి లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతిభద్రతల అంశం పై సమీక్ష సందర్భంగా డ్రగ్ మెనేస్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాలు వంటి మూడు ప్రధాన అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ‘ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా సమగ్రంగా పనిచేయాలని సూచించినట్లు తెలిపారు. ఈ మూడు అంశాలను కేవలం జిల్లా స్థాయిలో సమీక్షించడం కాకుండా మైక్రో లెవెల్ వరకు తీసుకెళ్లి, వార్డు, గ్రామ, పంచాయతీ స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణలో గ్రామస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. మహిళా పోలీస్, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితర క్షేత్రస్థాయి సిబ్బందిని ఒక సమన్వయ బృందంగా ఏర్పాటు చేసి స్థానిక సమస్యలను గుర్తించాలని సూచించారు. గ్రామాల్లో గృహ హింస, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ఎదురయ్యే సమస్యలు వంటి అంశాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. కిశోర బాలికలకు మహిళా పోలీసుల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌తో పాటు మహిళలు, బాలికల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణలో అవగాహన, కౌన్సెలింగ్, పరీక్షలు, తనిఖీలతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు, సరఫరా గొలుసుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కాలేజీ విద్యార్థులు, వలస కార్మికులు, గతంలో డ్రగ్స్ వినియోగం లేదా సరఫరాతో సంబంధం ఉన్న వ్యక్తులు, డ్రగ్స్ వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి లక్ష్యిత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగించే వారిని కౌన్సెలింగ్, అవగాహన, పునరావాసం ద్వారా సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టడంతో పాటు, డ్రగ్స్ సరఫరా చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్ విద్యాసంస్థలు, సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎంఈఓలు, సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలతో సమన్వయం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే పలు చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ప్రమాదానికి కారణాలను విశ్లేషించి, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను తక్షణమే గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అతివేగం, వాహనదారుల నిర్లక్ష్యం, రాత్రి వేళల్లో ప్రమాదాలు, రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు, అలసటతో డ్రైవింగ్ చేయడం వంటి అంశాలతో పాటు లైటింగ్, సిగ్నలింగ్, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు, క్రాష్ బ్యారియర్లు, సేఫ్టీ గార్డ్ రైల్స్, రహదారి క్రాసింగ్‌ల వద్ద భద్రతా చర్యలు వంటి ఇంజనీరింగ్ అంశాలను కూడా పరిశీలించాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన 48 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన భద్రతా చర్యలను పోలీస్, రవాణా శాఖల ప్రమాణాల మేరకు పరిశీలించి, ప్రతి బ్లాక్ స్పాట్ వద్ద చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా, ఇంకా ఏ అదనపు చర్యలు అవసరమో స్పష్టంగా నివేదిక అందించాలని డీటీసీని ఆదేశించారు. తదుపరి రెండు వారాల్లోగా అన్ని బ్లాక్ స్పాట్లను పరిశీలించి, అవసరమైన భద్రతా చర్యలు పూర్తయ్యాయా లేదా ధ్రువీకరించి నివేదిక సమర్పించాలని ఎస్‌డీపీవోలను కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన పనులను అత్యవసర ప్రాధాన్యతతో చేపట్టాలని తెలిపారు. నిధుల లభ్యతను కారణంగా చూపకుండా, అందుబాటులో ఉన్న నిధులు, సేవింగ్స్ ఫండ్స్ తదితర మార్గాలను వినియోగించి అవసరమైన భద్రతా చర్యలను పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రోడ్లపై నిలిచిపోయిన వాహనాల వల్ల రాత్రివేళల్లో ప్రమాదాలు జరగకుండా సరైన పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రతి 15–20 కిలోమీటర్ల పరిధిలో అవసరమైన పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారుల వెంట ఉన్న దాబాలు, మద్యం విక్రయాలు తదితర అంశాలపై కూడా సంబంధిత శాఖలు నిబంధనల మేరకు పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు ‘గోల్డెన్ అవర్’లో అత్యవసర వైద్య సేవలు అందేలా పోలీస్, వైద్య ఆరోగ్యం, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రమాద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సహాయం గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ, ‘ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్ మెనేస్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణ అనే మూడు అంశాలను సమగ్ర విధానంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
డ్రగ్స్ నియంత్రణలో మొదట అవగాహన, తర్వాత వినియోగదారులను గుర్తించడం–పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి పునరావాసం, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు అనే విధానాన్ని అనుసరించాలని తెలిపారు. గంజాయితో పాటు కొన్ని రకాల మాత్రలను కూడా మత్తు పదార్థాలుగా వినియోగిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో, మెడికల్ షాపుల్లో వాటి విక్రయాలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు, వెలుతురు, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి లైటింగ్, సైన్ బోర్డులు తదితర భద్రతా చర్యలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి విద్య, మహిళా మరియు శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, ఆర్‌టీఏ, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ సరఫరా గొలుసుపై ప్రత్యేక దృష్టి పెట్టి, సరఫరా చేసే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారులకు మాత్రం కౌన్సెలింగ్, అవగాహన, పునరావాసం ద్వారా సహాయం అందించే విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాస రావు, శ్రీ లత, డీటీసీ మురళి మోహన్, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, డీఈఓ కుమార్, ఐసీడీఎస్ పి డి వసంత బాయి, ఆర్ టీ సి ఆర్ ఎం శ్రీనివాస్ రావు, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ, పోలీస్, రవాణా, విద్య, వైద్య ఆరోగ్య, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల అధికారులు, ఎస్‌డీపీవోలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News