-ధన్వంతరి హోమం నిర్వహణ
-సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ
-ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ డా.ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మరియు ఆయుర్వేద వైద్య విధాన అభివృద్ధిని ఆకాంక్షిస్తూ శ్రీ ధన్వంతరి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ శాఖ డైరెక్టర్ గోపాలకృష్ణ రొణంకి, అదనపు డైరెక్టర్ డా.పి.సాయి సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ జె.ధనుంజయరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన యూజి విద్యార్థులు, పిజి స్కాలర్లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. అలాగే జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలు, కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, బహుమతులు అందజేశారు.
ఈ వేడుకలు ఆయుర్వేద విద్య, పరిశోధన, వైద్య సేవలు మరియు ప్రజల్లో ఆయుర్వేదంపై అవగాహన పెంపొందించడంలో డా. ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల యొక్క నిబద్ధతను ప్రతిబింబించాయి.
ఈ కార్యక్రమాన్ని డా. ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా.టి.బుల్లయ్య,
డా. ఏ.ఎల్. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.పి.జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పిజి స్కాలర్లు, ఇంటర్న్‌లు, ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News