-న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కేరాఫ్ అడ్రస్ తో వ్యక్తిగత ప్రయోజనంతో వీరబాబు అనే వ్యక్తి ఫైల్ చేసిన 10 ద్వితీయ అప్పీళ్లను తిరస్కరిస్తూ తెలుగులో తీర్పు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనర్ ఆదెన్న
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న సమక్షంలో విచారణకు వచ్చిన 10 ద్వితీయ అప్పీల్ కేసు నంబర్లు 3158, 3159, 3160, 3161, 3162, 3163, 3164, 3166, 3167 మరియు 3168/2025లను ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న తిరస్కరిస్తూ ఉత్తర్వులను తెలుగులో జారీ చేశారు
ఈ కేసుల్లో అప్పీలుదారు దాడిశెట్టి వీరబాబు, సమాచార హక్కు చట్టం–2005లోని సెక్షన్ 6(1) కింద వివిధ ప్రజా సమాచార అధికారులను (PIOs) సంప్రదించి సమాచారం కోరారు. సంబంధిత పీఐఓల సమాధానాలతో సంతృప్తి చెందక, సెక్షన్ 19(1) కింద మొదటి అప్పీళ్లు, అనంతరం సెక్షన్ 19(3) కింద ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ముందు ద్వితీయ అప్పీళ్లు దాఖలు చేశారు. కేసులు పరస్పరం సంబంధం కలిగి ఉండటంతో కమిషనర్ గాజుల ఆదెన్న వాటిని బ్యాచ్‌గా కలిపి విచారించారు.
విచారణ సమయంలో సంబంధిత పీఐఓలు, మొదటి అప్పీళ్ల అధికారులు ఆన్‌లైన్‌లో హాజరై, తమ పరిధిలో ఉన్న సమాచారాన్ని ఇప్పటికే అప్పీలుదారుకు అందించామని, అలాగే తమ కార్యాలయ రికార్డుల్లో లేని సమాచారాన్ని కూడా కోరుతున్నారని కమిషన్‌కు తెలిపారు. అప్పీలుదారు తరఫున న్యాయవాది గుర్రం రామారావు హాజరయ్యారు. కమిషన్ సూచన మేరకు అప్పీలుదారు స్వయంగా కూడా ఆన్‌లైన్‌లో విచారణకు హాజరయ్యారు.
అయితే, తన ఆర్టీఐ దరఖాస్తుల్లో ఏ సమాచారం కోరారో, ఆ సమాచారం ఏ విధంగా అందలేదో, సంబంధిత పీఐఓల నుంచి వాస్తవంగా ఏ సమాచారం కావాలో, అలాగే ద్వితీయ అప్పీళ్ల ద్వారా కమిషన్ నుంచి ఏ నిర్దిష్ట పరిష్కారం కోరుతున్నారో అప్పీలుదారు స్పష్టంగా వివరించలేకపోయారని కమిషన్ పేర్కొంది. విచారణ మధ్యలో ఎటువంటి కారణం తెలియజేయకుండా ఆన్‌లైన్ విచారణ నుంచి నిష్క్రమించిన అంశాన్ని కూడా కమిషన్ గమనించింది.
అప్పీలుదారు తన స్వంత నివాస చిరునామాకు బదులుగా “C/o Sri Jada Sravan Kumar” చిరునామాను ఉపయోగించడం, గతంలో కూడా న్యాయవాది ద్వారా ప్రాతినిధ్యం వహించడం వంటి అంశాలను కమిషన్ పరిశీలించింది. కేసులకు సంబంధించిన ఆర్టీఐ దరఖాస్తులు, ద్వితీయ అప్పీళ్లు జడ శ్రవణ్ కుమార్ కార్యాలయంలో సిద్ధం చేసినట్లు విచారణలో వెల్లడైన విషయాన్ని కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుంది.
సమాచార హక్కు చట్టంలోని *సెక్షన్ 3, సెక్షన్ 2(f), సెక్షన్ 2(j)*లను ప్రస్తావిస్తూ, ప్రజా అధికారుల వద్ద లేదా వారి నియంత్రణలో ఇప్పటికే రికార్డు రూపంలో ఉన్న సమాచారాన్ని పొందే హక్కు పౌరులకు ఉంటుందని కమిషన్ పేర్కొంది. కొత్త సమాచారాన్ని సృష్టించడం, అభిప్రాయాలు లేదా సలహాలు ఇవ్వడం, ఊహలు లేదా అనుమానాల ఆధారంగా సమాధానాలు రూపొందించడం పీఐఓల బాధ్యత కాదని తెలిపింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు CBSE Vs. Aditya Bandopadhyay, బాంబే హైకోర్టు Dr. Celsa Pinto Vs. Goa State Information Commission, మద్రాస్ హైకోర్టు N. Saravanan Vs. The Chief Commissioner మరియు సుప్రీంకోర్టు Pandurang Vithal Kevne Vs. Bharat Sanchar Nigam Limited తీర్పులను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది.
తన పేరుతో దాఖలైన అప్పీళ్లలోని ప్రాథమిక అంశాలపై అప్పీ3లుదారుకు స్పష్టమైన అవగాహన లేకపోవడం, అప్పీళ్లు ఆయనే స్వయంగా కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయంగా నిరూపించలేకపోవడం, అలాగే కోరిన సమాచారానికి సామాజిక లేదా ప్రజా ప్రయోజనంతో ఉన్న సంబంధాన్ని కమిషన్ ముందు నిరూపించలేకపోవడం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం, పై 10 ద్వితీయ అప్పీళ్లను డిస్మిస్ చేస్తూ కమిషనర్ గాజుల ఆదెన్న ఉత్తర్వులను తెలుగులో జారీ చేశారు
అయితే, ఈ ఉత్తర్వు ప్రస్తుత 10 ద్వితీయ అప్పీళ్లకు మాత్రమే పరిమితమని, భవిష్యత్తులో సమాచార హక్కు చట్టం కింద అప్పీలుదారు తనకు అవసరమైన సమాచారాన్ని తన స్వంత చిరునామాను పేర్కొంటూ, స్వయంగా మరియు సహేతుకమైన రీతిలో కోరుకునే హక్కుపై ఎటువంటి నిషేధం విధించలేదని కమిషన్ స్పష్టం చేసింది.
కమిషన్ సమయాన్ని అనవసరంగా వృథా చేయడం వల్ల నిజమైన RTI పిటిషనర్లకు నష్టం కలిగే అవకాశం
సమాచార హక్కు చట్టం కింద ప్రజలు కోరుతున్న సమాచారాన్ని సకాలంలో అందించేందుకు కమిషన్ సమయం అత్యంత విలువైనదని గుర్తించాల్సిన అవసరం ఉంది.
అలాగే సమాచారం కోసం నిజమైన ఉద్దేశంతో RTI దరఖాస్తులు చేసుకుని, సంబంధిత సమాచారం అందక కమిషన్‌ను ఆశ్రయించే పిటిషనర్లు అనేక మంది ఉన్నారు. అలాంటి పిటిషనర్ల కేసుల విచారణ ఇప్పటికే సమయం తీసుకుంటున్న నేపథ్యంలో, అనవసరమైన వివాదాలు, పునరావృత వాదనలు లేదా అవసరం లేని అంశాల కారణంగా కమిషన్ విలువైన సమయం వృథా అయితే, నిజంగా సమాచారం అవసరమైన పిటిషనర్ల కేసుల విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న అన్నారు.
దీని ప్రభావం చివరికి సమాచారం కోసం ఎదురుచూస్తున్న సాధారణ ప్రజలపైనే పడుతుందని, ఒక కేసులో అనవసరంగా కమిషన్ సమయం ఎక్కువగా వినియోగించడం వల్ల, అదే సమయంలో విచారణ కోసం ఎదురుచూస్తున్న ఇతర నిజమైన RTI పిటిషనర్లకు సంబంధించిన కేసులు ఆలస్యం కావచ్చని అన్నారు.
ఈ నేపథ్యంలో, కమిషన్ సమయాన్ని అనవసరంగా వినియోగించడానికి లేదా వృథా చేయడానికి ఎవరికీ అధికారం లేదని కమిషన్ స్పష్టం చేసింది. కమిషన్ సమయం ప్రజా ప్రయోజనానికి సంబంధించిన సమాచార హక్కు కేసుల పరిష్కారానికి వినియోగించాల్సిన విలువైన సమయం.
కాబట్టి ప్రతి పిటిషనర్, ప్రజా సమాచార అధికారి మరియు సంబంధిత పక్షాలు కమిషన్ ప్రక్రియను గౌరవిస్తూ, అవసరమైన అంశాలకే పరిమితమై సహకరించాలి. తద్వారా నిజంగా సమాచార హక్కు కోసం కమిషన్‌ను ఆశ్రయించిన పిటిషనర్లకు సకాలంలో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
కమిషన్ సమయం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు — ప్రజల సమాచార హక్కు పరిరక్షణ కోసం.
నిజమైన RTI పిటిషనర్ల సమయం ఆలస్యం కాకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యతని కమిషనర్ గాజుల అదెన్న తెలిపారు.
Prajavartha Online Telugu News