-2.45 లక్షల మంది శిశువులకు ఉపయోగం
-ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువుల కోసం
-ఒక్కొక్క కిట్టు ధర రూ. 1,400.22
-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లుల శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు అందించేందుకు ఏటా రూ.51.15 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏటా సుమారు 2.45 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని, ఒక్కో కిట్ ధర రూ.1,400.22గా ఉందని చెప్పారు. పుట్టిన తొలి రోజుల్లో శిశువును వెచ్చగా, శుభ్రంగా, సురక్షితంగా ఉంచడంతోపాటు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా తగిన సంరక్షణ అందించేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఒక్కో కిట్‌లో దోమల నివారణ వలతో కూడిన బేబీ బెడ్, బేబీ మాకింటోష్, శిశువుల దుస్తులు, బేబీ టవల్, ఉతికి మళ్లీ ఉపయోగించుకునే బేబీ న్యాపీలు మూడు, 200 గ్రాముల బేబీ పౌడర్, 100 మి.లీ. బేబీ షాంపూ, 200 మి.లీ. బేబీ ఆయిల్, బేబీ సబ్బు, సబ్బు పెట్టె, రాటిల్ టాయ్, కిట్ బ్యాగ్ ఉంటాయని మంత్రి వివరించారు.
ఎన్‌టీఆర్ బేబీ కిట్లతో శిశువులకు అవసరమైన ప్రాథమిక సంరక్షణ వస్తువులు అందుబాటులోకి వస్తాయని, శిశువుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతను కాపాడటంలో ఇవి ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవోను బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ జారీచేసింది.
Prajavartha Online Telugu News