– సీఎం చేతుల మీదుగా పండగ వాతావరణంలో పట్టాల పంపిణీ
– తొలిదశలో 24,042 మంది లబ్ధిదారులకు పట్టాలు
– క్రమబద్ధీకరణతో పేదల చేతుల్లో రూ. 23,213 కోట్ల విలువైన ఆస్తి
– అన్ని హక్కులతో ప్రజల దశాబ్దాల కల నెరవేరుతున్న శుభవేళ
– ఇంకా ఎవరైనా మిగిలితే రెండో దశలో వారి సమస్యలనూ పరిష్కరిస్తాం
– ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల ఆత్మగౌరవాన్ని కాపాడటం, ప్రతి పేద కుటుంబానికి శాశ్వత చిరునామా, పూర్తి హక్కులతో కూడిన ఆస్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 30న విజయవాడలో ముఖ్యమంత్రి చేతులుమీదుగా పండగ వాతావరణంలో పట్టాల పంపిణీ జరగనుందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. తొలిదశలో జిల్లా వ్యాప్తంగా 24,042 మంది లబ్ధిదారులకు రూ. 23,213 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఆస్తి క్రమబద్ధీకరణ ద్వారా పేదల చేతికి అందుతుందని పేర్కొన్నారు.
బుధవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఎంపీ కేశినేని శివనాథ్.. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌రావు, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 30వ తేదీన జరిగే కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇది ప్రజల ప్రభుత్వమని.. పేదల క్షేమం, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. 1970, 1980ల్లో, తదుపరి సంవత్సరాలలో జారీచేసిన ఎన్‌టీఆర్ పట్టాలు, ఇతర పట్టాలకు సంబంధించి 12,710 మంది లబ్ధిదారులకు జీవోఎంఎస్ నెం.306 ద్వారా మేలు జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఉంటున్న 2,586 మంది లబ్ధిదారుల కేసులను జీవోఎంఎస్ నెం.30 ద్వారా పరిష్కరించి, క్రమబద్ధీకరించడం జరిగిందన్నారు. 8,746 మంది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్ (పీవోటీ) ఉల్లంఘనదారుల సమస్య కూడా పరిష్కారమైందన్నారు. ఇలా ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలోని విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ మధ్య, గన్నవరం, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో 24,042 మంది లబ్ధిదారులకు చెందిన 616.56 ఎకరాల (దాదాపు 29,84,145 చదరపు గజాలు) భూమికి సంబంధించి ప్రైవేటు ఆస్తికి సమానంగా అన్ని హక్కులతో పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. ఇందుకు గౌరవ ముఖ్యమంత్రికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోందని.. రెండో దశలోనూ మిగిలిన వారి సమస్యలు పరిష్కారమవుతాయని, అందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు. సమష్టి కృషి, పటిష్ట సమన్వయం కారణంగా ఇది సాధ్యమైందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. వివిధ సమావేశాల్లో చర్చించి, సమస్య పరిష్కారానికి కృషిచేయడం జరిగిందని, దశాబ్దాలుగా జఠిలంగా ఉన్న సమస్యను పరిష్కరించి, పేదలకు భరోసా కల్పించినందుకు సీఎం, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఏవైనా ఉంటే వాటిని కూడా పరిశీలించి క్రమబద్ధీకరించడం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సమష్టిగా కృషిచేసి పట్టాల పంపిణీకి సన్నద్ధమైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, నియమనిబంధనలను అనుసరించి పట్టాలు అందించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో విజయవాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News