Breaking News

జ‌న‌వ‌రి 1 నుంచి సంజీవ‌ని ప్రాజెక్టు అమ‌లు చ‌ర్య‌ల ముమ్మ‌రం

-జిల్లాలవారీగా స‌మ‌న్వ‌య క‌ర్త‌ల నియామ‌కం
-ఏఎన్ఎం, ఆశాల నుంచి జిల్లా అధికారుల వ‌ర‌కు శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు
-సన్నద్ధత జిల్లాల వారీగా స‌మీక్ష‌లు
-సిద్ధ‌మ‌వుతున్న ఆరోగ్య ర‌థాలు (104 వాహనాలు)
-25న ధర్మవరంలో 71 వాహ‌నాల ప్రారంభం
-మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా జ‌న‌వ‌రి నుంచి సంజీవ‌ని ప్రాజెక్టును అమ‌లు చేసేందుకు అవ‌స‌ర‌మైన ముంద‌స్తు చ‌ర్య‌ల్ని వేగ‌వంతం చేసిన‌ట్లు రాష్ట్ర వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు. ఏఎన్ఎం, ఆశా వ‌ర్క‌ర్ల ద‌గ్గ‌ర నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల వ‌ర‌కు సంజీవ‌ని అమ‌లు కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని చెప్పారు. 28 జిల్లాల్లో ప్ర‌తి జిల్లాకు ఒక సీనియ‌ర్‌ వైద్యులు లేదా అధికారిని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించామ‌ని చెప్పారు. శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు కూడా నిర్ణీత వ్య‌వ‌ధిలో నిర్వ‌హించేందుకు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించామ‌ని చెప్పారు. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే 104 వాహ‌నాల్ని (ఆరోగ్య ర‌థాలు) కూడా సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు. జిల్లా వైద్య‌, ఆరోగ్య శాఖాధికారులు, డైరెక్ట‌రేట్ ఆఫ్ సెకండ‌రీ హెల్త్ జిల్లాల అధికారులు, బోధానాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, వివిధ హోదాలో ఉన్న అధికారుల‌తో వైద్య‌, ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి జి.వీర‌పాండియ‌న్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ చ‌క్ర‌ధ‌ర్ బాబు బుధ‌వారం హైబ్రిడ్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. సంజీవ‌ని అమ‌లుకు సంబంధించి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కార్య‌ద‌ర్శి వీర‌పాండియ‌న్ , క‌మీష‌న‌ర్ చక్ర‌ధ‌ర్‌బాబు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు నివేదించారు. ఇదే సమ‌యంలో 104 వాహ‌నాలను సంజీవ‌ని ద్వారా జ‌రిగే ప‌రీక్ష‌ల‌కు అనుకూలంగా సిద్ధం చేయ‌డంపై వారి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన విధంగా జ‌న‌వ‌రి 1 నుంచి సంజీవ‌ని ప్రాజెక్టు అమ‌లును
పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు వీలుగా ప‌క‌డ్బందిగా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు.

ధ‌ర్మ‌వరంలో 25న 71 ఆరోగ్య ర‌థాల సేవ‌లు ప్రారంభం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 21 ఆరోగ్య రథాలను ఆగస్టు 29న సేవల్లోకి తీసుకువచ్చారు. సెప్టెంబరు 22 నాటికి ఈ వాహనాలు 6,569 పరీక్షలు నిర్వహించాయి. ఈ నెల 25న అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించిన 104 వాహ‌నాలు (ఆరోగ్య ర‌థాలు) మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్రారంభించనున్నారు. అనంతపురం జిల్లాకు 36, శ్రీ సత్యసాయి జిల్లాకు 35 చొప్పున మొత్తం 71 ఆరోగ్య రథాలు సేవలందించ‌నున్నాయి.

41 రకాల పరీక్షలు.. రథాల్లోనే

ఆరోగ్య రథాల్లో రక్తంలో చక్కెర, రక్తపోటుతో పాటు కాలేయం, మూత్రపిండాల పనితీరు, రక్తంలోని కొవ్వు పదార్థాలు, రక్తంలోని వివిధ అంశాలు, శరీరంలోని లవణాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 41 రకాల ప్రయోగశాల పరీక్షలను ఉచితంగా అందించనున్నారు. ఒక్కో రథం ద్వారా రోజుకు కనీసం 20 మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆధునిక పరికరాలతో రథాలు

పరీక్షలకు అవసరమైన పరికరాలను ఆరోగ్య రథాల్లోనే ఏర్పాటు చేశారు. రక్త పరీక్షలు, రక్తంలోని కణాల పరీక్షలకు అవసరమైన పరికరాలతో పాటు నమూనాలను నిర్ణీత ఉష్ణోగ్రతలో భద్రపరిచే సదుపాయాలు ఉన్నాయి. దీంతో నమూనాలను దూర ప్రాంతాలకు తరలించే అవసరం తగ్గుతుంది. పరీక్షల ఫలితాలను డిజిటల్‌ ఆరోగ్య రికార్డుల్లో నమోదు చేసి భద్రపరచనున్నారు.

వాహనాల ఆధునికీకరణ

రాష్ట్రంలో 104 మొబైల్‌ వైద్య సేవల కింద మొత్తం 904 వాహనాలు ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణలో భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ (BHSPL) ఈ వాహనాలను నడుపుతోంది. ఈ 104 వాహనాలను ‘సంజీవని’ కార్యక్రమంతో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. డిజిటల్‌ ఆరోగ్య రికార్డులు, తదుపరి వైద్య సేవలు, దూర వైద్య సలహాలు, సూచనలు, అవసరమైన వారికి వైద్య సేవలకు పంపే విధానం ఇందులో భాగంగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్త విస్తరణకు ముందు కుప్పంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2025 సెప్టెంబరు–అక్టోబరు మధ్య సుమారు 63,867 మందికి పరీక్షలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 2026 జూలైలో ఒక వాహనంతో ఐదు రోజుల్లో 702 పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు విధంగా 104 వాహనాల్లో ఆధునిక పరికరాలు సిద్ధం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *