-కలెక్టర్ హిమాన్షు శుక్ల
చిల్లకూరు, నేటి పత్రిక ప్రజావార్త :
“పేదల సేవలో ప్రజా వేదిక” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి మారుపేరుగా నిలిచిన గూడూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి విచ్చేయడం జిల్లా ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. గూడూరు, కోట, చిల్లకూరు, ముత్తుకూరు మండలాల్లో 27 మెగా పరిశ్రమల ద్వారా రూ.27,988 కోట్ల పెట్టుబడులు ఆకర్షించబడగా, 19,819 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. ఇది జిల్లాలో వేగంగా జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనమన్నారు.
కృష్ణపట్నం పోర్టు అంతర్జాతీయ వాణిజ్యానికి, కొత్త పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కేంద్రంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారతదేశంలోని రెండు ప్రధాన మెగా ఫర్నిచర్ పార్కుల్లో ఒకటి మన నెల్లూరు జిల్లాలో రూ.3,500 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానుండటం గర్వకారణమన్నారు. ఈ మెగా ఫర్నిచర్ క్లస్టర్‌లో 400 నుంచి 550 తయారీ యూనిట్లు ఏర్పడి, కృష్ణపట్నం పోర్టు అనుసంధానంతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వివరించారు.
ప్రతి నెల “పేదల సేవలో ప్రజా వేదిక” కార్యక్రమం ద్వారా స్వయంగా లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు అందజేస్తూ సంక్షేమ పాలనకు కొత్త నిర్వచనం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో నెల్లూరు జిల్లా మరింత ప్రగతి సాధిస్తుందనే పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News