Breaking News

ప్రతిరోజూ వ్యర్థాల సేకరణ, శాస్త్రీయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిరోజూ వ్యర్థాల సేకరణ, శాస్త్రీయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సూర్యారావుపేట, గవర్నర్‌పేట, ప్రకాశం రోడ్, సింగ్‌నగర్, సుందరయ్య నగర్, విశాలాంధ్ర కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, ప్రజలకు అందుతున్న పారిశుద్ధ్య సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి రోజు ఇంటింటా వ్యర్థాల సేకరణను తప్పనిసరిగా నిర్వహించి, సేకరించిన వ్యర్థాలను వెంటనే గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి జిందాల్‌కోకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పారిశుద్ధ్య కార్మికులు ప్రధాన రహదారులపై విధులు నిర్వహించే సమయంలో వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రహదారులపై కోన్లు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేసి సురక్షిత వాతావరణంలో విధులు నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఎక్కడా చెత్త కుప్పలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు.

2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలకు అనుగుణంగా ప్రజలు తడి, పొడి, గృహ ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా అందించేలా ప్రతి వార్డులో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ తెలిపారు. వ్యర్థాల మూలస్థాయిలోనే విభజన జరిగితే శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా అమలవుతుందని అన్నారు.

తదుపరి సింగ్‌నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించారు. అక్కడకు వచ్చే లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, భవనంలో లేదా ఇతర సౌకర్యాల్లో మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్‌లో ఎల్లప్పుడూ తాగునీటి సరఫరా అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పరిశుభ్రత నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, శానిటరీ సూపర్వైజర్ సలీం, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *