-కేంద్ర జౌళి, హస్తకళల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారు తిరుమలలోని ఫీనిక్స్ గెస్ట్ హౌస్‌లో కేంద్ర జౌళి, హస్తకళల శాఖ మంత్రి ను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర హస్తకళల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హస్తకళల పరిరక్షణ, కళాకారుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్, ఎగుమతుల విస్తరణకు సంబంధించిన సమగ్ర వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి సమర్పించారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ముఖ్యంగా బి.కొత్తకోట, తిరుచానూరు, మాధవమాల, శెట్టిగుంట ప్రాంతాల్లో తయారవుతున్న చెక్కబొమ్మలు, దేవతామూర్తులు, సంప్రదాయ వుడ్ హ్యాండీక్రాఫ్ట్స్ భారతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయని పేర్కొన్నారు. తరతరాలుగా ఈ కళలను జీవనోపాధిగా కొనసాగిస్తున్న కళాకారులను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని వివరించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 11 జీఐ (Geographical Indication) గుర్తింపు పొందిన హస్తకళ ఉత్పత్తులు ఉన్నాయని, మరికొన్ని ప్రత్యేక హస్తకళ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ల కోసం దరఖాస్తులు సమర్పించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. పెండింగ్‌లో ఉన్న జీఐ ట్యాగ్‌లను త్వరితగతిన మంజూరు చేస్తే రాష్ట్ర కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు, మార్కెట్ అవకాశాలు లభిస్తాయని కోరారు.
రాష్ట్రంలోని హస్తకళలను ప్రోత్సహించేందుకు క్రాఫ్ట్ విలేజీల ఏర్పాటు అత్యంత అవసరమని పేర్కొంటూ, అంగళ్లులోని టెర్రకోట కళలకు ఒక క్రాఫ్ట్ విలేజ్, ఏటికొప్పాకలో లక్కబొమ్మల కళకు ఒక క్రాఫ్ట్ విలేజ్, కొండపల్లి బొమ్మల కోసం మరో క్రాఫ్ట్ విలేజ్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రాఫ్ట్ విలేజీలు కళాకారులకు స్థిరమైన ఉపాధితో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి కూడా దోహదపడతాయని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది హస్తకళా కళాకారులు వివిధ కళారూపాల ద్వారా జీవనం సాగిస్తున్నారని, 45 హస్తకళ క్లస్టర్లు, 36 “వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ (ODOP)” ఉత్పత్తులు రాష్ట్ర ప్రత్యేకతను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. వీటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెటింగ్, బ్రాండింగ్, ఎగుమతుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకారం అందించాలని కోరారు.
ప్రస్తుతం ప్రతి ఏడాది నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, ప్రదర్శనలు, మార్కెటింగ్ ఈవెంట్లకు బదులుగా ఐదేళ్ల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (Five-Year Action Plan) రూపొందించాలని ప్రతిపాదించారు. శిక్షణ, డిజైన్ అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఈ-కామర్స్, దేశీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, కళాకారుల సంక్షేమ పథకాలను ఒకే ప్రణాళిక కింద అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హస్తకళల పరిరక్షణకు నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని పేర్కొన్న డా. పసుపులేటి హరిప్రసాద్, ఐటీఐల తరహాలో ప్రత్యేక హ్యాండీక్రాఫ్ట్స్ శిక్షణా కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, విజయవాడ ప్రాంతం, రాయలసీమలో నాలుగు ప్రాంతీయ హ్యాండీక్రాఫ్ట్స్ ట్రైనింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సంప్రదాయ కళలు భావితరాలకు సంక్రమిస్తాయని వివరించారు.
రాష్ట్రంలోని హస్తకళలను “Protect – Promote – Profit” అనే లక్ష్యంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, కళాకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ పరంగా మరింత సహకారం అందించాలని కోరారు. కళాకారుల ఆదాయాన్ని పెంచడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో హస్తకళల రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ప్రధానమంత్రి చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా”, “వోకల్ ఫర్ లోకల్” కార్యక్రమాల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ హస్తకళలను ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థకు అవసరమైన నిధులు, శిక్షణా కేంద్రాలు, డిజైన్ సపోర్ట్, మార్కెటింగ్, ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హస్తకళల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హామీ ఇచ్చినట్లు డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.
Prajavartha Online Telugu News