-కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సేవల్ని ప్రారంభించిన సీఎం
-డ్రగ్స్, గంజాయిపై మరింత కఠినంగా ఉండాలని పోలీసులకు ఆదేశం
-పంచతత్వ కాన్సెప్టుతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ పరిశీలించిన సీఎం చంద్రబాబు
కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
సంజీవని కార్యక్రమంలో డేటా అనుసంధానమే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ నుంచి ఆస్పత్రి పరిశుభ్రత వరకు ప్రతీ అంశంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ పర్యటన రెండో రోజు కుప్పం ప్రాంతీయ ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించి సేవలను పరిశీలించారు. సంజీవని ప్రాజెక్టు అమలు, వైద్యారోగ్య రంగంలోని ఆవిష్కరణలు, డ్రగ్స్ నివారణ చర్యలపై అధికారులతో మాట్లాడారు.
డిజిటలైజేషన్ తో పాటు డేటా ఇంటిగ్రేషన్ అవసరం
కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. సీటీ స్కాన్ ద్వారా రోజుకు ఎంత మందికి సేవలు అందించగలరని సీఎం ప్రశ్నించారు. రోజుకు 30–40 మందికి పరీక్షలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆస్పత్రిని పరిశీలన సందర్భంగా ఆవరణలో కొంత మేర చెత్త కనిపించడంపై ప్రశ్నించిన ముఖ్యమంత్రి, వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంజీవని కార్యక్రమంలో డేటా అనుసంధానమే ముఖ్యమని పేర్కొన్నారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడంతోపాటు ప్రతి అంశంలోనూ డేటా ఇంటిగ్రేషన్ చేయాలని సూచించారు. డయాలసిస్ వార్డును సందర్శించిన సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కుప్పం ఏరియా ఆస్పత్రికి డయాలసిస్ నిమిత్తం వస్తున్నారని అధికారులు వివరించారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజలు సంతృప్తి చెందాలని, కుప్పంలో ప్రజలకు ఏ మేరకు మేలు కలిగిందో వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు
పంచతత్వ కాన్సెప్టుతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు అక్కడ మొక్క నాటారు. వైద్యారోగ్య రంగంలో వివిధ ఆవిష్కరణలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో వైద్యులకు తక్షణ సమాచారం అందించేలా ఓ పరికరం రూపొందించిన విద్యార్థిని సీఎం అభినందించారు. గంజాయి, డ్రగ్స్ బారిన పడ్డవారికి మెడిటేషన్ ద్వారా ఆరోగ్యం మెరుగయ్యేందుకు సహకారం అందిస్తున్నట్టు బ్రహ్మకుమారీలు వివరించారు. డ్రగ్స్, గంజాయి వంటి వాటిని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కుప్పం నగరంలో ఏర్పాటు చేసిన స్వర్ణ కుప్పం–స్వచ్ఛ కుప్పం స్వాగత ఆర్చ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖమంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News