-తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆర్టీఐ కార్యకర్త
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవస్థలో పారదర్శకత కోసం ఆర్టీఐ చట్టం ఒక శక్తివంతమైన ఆయుధమని, అయితే దానిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆర్టీఐ కార్యకర్త నాగార్జునరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం, వేటపాలేనికి చెందిన తాను 2010 నుంచి జర్నలిస్టుగా మరియు ఆర్టీఐ కార్యకర్తగా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు సమాచార కమిషన్ వద్ద తాను వందలాది అప్పీళ్లు దాఖలు చేసినప్పటికీ, ఎటువంటి స్పష్టమైన ఉత్తర్వులు అందడం లేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ప్రధాన సమాచార కమిషనర్ 160 కేసులను విచారించినా, ఎటువంటి ఫలితం లేదని ఆయన వాపోయారు.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనల ఉల్లంఘనలు, స్మశాన భూములు, ప్రభుత్వ నివేశన స్థలాలు, అసైన్డ్ భూములు, ఫారెస్ట్ మరియు స్వర్ణముఖి భూముల ఆక్రమణలకు వ్యతిరేకంగా తాను నిరంతరం పోరాడుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల వైఖరి వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి సకాలంలో న్యాయం అందడం లేదని ఆయన విమర్శించారు. జూలై 2న మీడియా మరియు సోషల్ మీడియాలో తనపై వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారులను బెదిరించానని, బ్లాక్ మెయిల్ చేశానని, మహిళా పోలీస్ అధికారికి అసభ్యకర మెసేజ్‌లు పంపాన్ననే ఆరోపణలు పూర్తిగా అబద్దమని ఇవి తనపై జరిగిన కుట్రలో భాగమని అటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే మీడియా ద్వారా బహిరంగ పరచాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశం ద్వారా తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, అన్యాయాలపై తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News