-నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయం:మంత్రి దుర్గేష్
-నేషనల్ ఫిలిమ్స్ లో 9 అవార్డులతో టాలీవుడ్ సత్తా చూపించడం గర్వంగా ఉంది:మంత్రి దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో టాలీవుడ్ ఏకంగా 9 జాతీయ అవార్డులను కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమా మరోసారి తన జైత్రయాత్రను చాటిచెప్పడం ఆనందంగా ఉంది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై 9 పురస్కారాలతో టాలీవుడ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం ప్రతి ఒక్క తెలుగువారికీ గర్వకారణం. ముఖ్యంగా నిహారిక కొణిదెల సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై యువ ప్రతిభతో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయం. పల్లెటూరి నేపథ్యంలో స్నేహం,కుటుంబ బంధాలు, సామాజిక విలువలు, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించి జాతీయ అవార్డును అందుకోవడం ఈ చిత్ర బృందం సాధించిన ఘన విజయం” అని కొనియాడారు.
తెలుగు సినిమా కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా.. కథ, కథనం, నటన, సాంకేతిక నైపుణ్యం, కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్ మరియు అద్భుతమైన నిర్మాణ విలువలు.. ఇలా 24 క్రాఫ్టుల్లోనూ తన తిరుగులేని ప్రతిభను చాటుకుందని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు. వెండితెరపై తెలుగు వారి సృజనాత్మకతకు, కష్టానికి దక్కిన గౌరవం ఈ జాతీయ పురస్కారాలని ఆయన పేర్కొన్నారు.
భారతీయ చలనచిత్ర యవనికపై మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసి, తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా చేసిన నటులు, దర్శకులు, నిర్మాతలు మరియు సాంకేతిక నిపుణులతో కూడిన చిత్ర బృందాలన్నింటికీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ ప్రకటన ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా మరిన్ని అంతర్జాతీయ శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News