-ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి
-సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు యువకులపై పోలీసులు లాఠీచార్జి టియర్ గ్యాస్ ప్రయోగించి దాడి చేయడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో గత నెల రోజులుగా విద్యార్థులు, యువకులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే, ప్రత్యేకించి సిజెపి ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిష్కే నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. జాతీయ పరీక్షల్లో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ వేత్త సోనం వాంగ్ చుక్ 22 రోజులు పాటు దీక్ష చేయడం జరిగింది. ఈ నిరసనలపై మోడీ సర్కార్ మొండిగా వ్యవహరిస్తోంది. దీంతో చలో పార్లమెంటుకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు చలో పార్లమెంట్ కార్యక్రమం జరుగుతుండగా వేలాది మంది పోలీసులు మోహరించి, ఎక్కడికక్కడ విద్యార్థులను యువకులను ఆపేశారు. అయినప్పటికీ వేలాదిగా ఢిల్లీ చేరుకున్నారు. పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం దుర్మార్గం. విద్యార్థులపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు విక్రమ్ 1 సక్సెస్ అయిందనే పేరుతో యువతను పొగుడుతూ, మరోవైపు విద్యార్థి యువజనులపై పోలీసులను ఉపయోగించి లాఠీచార్జీలు, దాడులు చేయిస్తున్నారు. ప్రధాన నరేంద్ర మోడీ ద్వంద వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తదుపరి 12 ఏళ్ల కాలంలో 82 పరీక్ష పత్రాలు లీకయ్యాయి. నీట్ పరీక్ష పత్రం లేకపోవడం పరాకాష్ట. ఫలితంగా దాదాపు 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విద్యార్థుల డిమాండ్ల పరిష్కారానికి చర్చలు జరపాలి. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు హోం మంత్రిని కలిశారు. ఆయన హోం మంత్రిని కాకుండా ప్రధాని మోడీని కలిసి తక్షణమే రాజీనామా సమర్పించడమే ఈ సమస్యకు పరిష్కారమని తెలియజేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News