– తాజాగా మరో పదిమందికి పత్రాల అందజేత
– అత్యంత పారదర్శకంగా దరఖాస్తుల పరిష్కారం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిషేధిత భూముల (22-ఏ) జాబితాలో పొరపాటున నమోదైన భూములకు సంబంధించి పట్టాదారులకు సత్వర న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును పారదర్శకంగా, చట్టబద్ధంగా, వేగవంతంగా పరిశీలిస్తూ 22(ఏ) కేసుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.
22ఏ నుంచి తొలగించి భూ యాజమాన్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించి సోమవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డిహాల్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. పదిమందికి ధ్రువీకరణపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 22(ఏ) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు పరిష్కారమైన కేసులకు సంబంధించి అర్జీదారులకు పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి సత్వర పరిష్కారం అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. గత మూడు నెలల కాలంలోనే 62 ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగిందన్నారు. భూ వివాద రహిత గ్రామాలు లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News