Breaking News

రామాయపట్నం పోర్టు పీపీపీ విధానంపై ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీకి లేదు : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-మీరు సీఎంగా ఉన్న ఐదేళ్లలో PPP విధానాన్ని ఎప్పుడైనా వ్యతిరేకించారా ?
-గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను ప్రైవేట్ సంస్థకు విక్రయించినప్పుడు ఈ సిద్ధాంతాలు ఎక్కడికి వెళ్లాయి?
-పారదర్శకత లేకుండా, అడ్డగోలుగా 2 బెర్తులను JSW సంస్థకు అప్పగించినప్పుడు ప్రజా ప్రయోజనాలు గుర్తుకు రాలేదా?
-వైసీపీ హాయాంలో 95% రామాయపట్నం పోర్టులు పూర్తయ్యాయనేది అవాస్తవం
-జూన్ 2024 నాటికి పోర్టు పనులు 50% మాత్రమే పూర్తి.. కూటమి ప్రభుత్వం వచ్చాక 80.50% వరకు పూర్తి చేశాం.
-PPP అంటే పోర్టుల అమ్మకం కాదు, దేశంలో 91% పోర్టులు ఇదే విధానంలో విజయవంతంగా నడుస్తున్నాయి..
-కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం వంటి పోర్టులు 29 ఏళ్లుగా PPP విధానంలోనే విజయవంతంగా పనిచేస్తున్నాయి
-రాబోయే రోజుల్లో 3 గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల అభివృద్ధికి రూ. 50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు అవసరం
-PPP ద్వారానే పెట్టుబడులు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఆదాయం మెరుగవుతాయి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రామాయపట్నం పోర్టును అమ్మేస్తున్నారని మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఎంతమాత్రం లేదు… ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు ఇష్టారీతిన తెగనమ్మిన చరిత్ర వైసీపీదేనని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రామాయపట్నం పోర్టుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో సాక్షి పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అసత్యాలతో, వక్రీకరణలతో నిండి ఉందన్నారు.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్ మోహన్ రెడ్డి తన సొంత మీడియాను మరోసారి వేదికగా ఉపయోగించుకోవడం అత్యంత దురదృష్టకరమని ఒక ప్రకటనలో మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో గత ఐదేళ్లు పాలనను కుంభకోణాలమయం చేసిన, జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై అవే విమర్శలు చేస్తుంటే, ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి తెలిపారు.. రామాయపట్నం పోర్టుపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు పూర్తిగా విరుద్ధం. గత వైసీపీ ప్రభుత్వం పోర్టుల పేరుతో ఏ విధంగా వ్యవహరించిందో ప్రజలందరికీ బాగా తెలుసన్నారు.. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10.40 % వాటాను అదానీ సంస్థకు విక్రయించినది ఎవరో జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

2023లో ఎలాంటి పారదర్శక టెండర్ విధానం లేకుండా, ప్రభుత్వ ప్రయోజనాలు పట్టకుండా 2 బెర్తులను ప్రైవేట్ సంస్థ JSW కు అప్పగించింది ఎవరని మంత్రి ప్రశ్నించారు.? ప్రభుత్వానికి కనీస ఆదాయం, రెవెన్యూ షేర్, ఈక్విటీ వాటా లేకుండా ఒప్పందాలు చేసిన ప్రభుత్వం మీదీ కాదా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.. ఇవన్నీ మరిచిపోయి ఇప్పుడు ప్రజలకు నీతులు చెప్పడం రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి కాదని ప్రతిపక్ష నేతకు మంత్రి చురకలు అంటించారు.

రామాయపట్నం పోర్టు విషయంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆదాయం వచ్చేలా రూపొందించబడ్డాయని తెలిపారు.. రూ.1,500 కోట్ల ముందస్తు ప్రీమియం, రాబడి భాగస్వామ్యం, కనీస గ్యారెంటీ ఆదాయం (MGR), 12 శాతం తగ్గని ఈక్విటీ వాటా వంటి నిబంధనలను ఒప్పందంలో స్పష్టంగా పొందుపరుస్తున్నామనే విషయం గుర్తెరగాలన్నారు. అలాగే వివిధ దశల్లో కాంట్రాక్టర్ పెట్టే పెట్టుబడి సుమారు రూ. 20 వేల కోట్లలో కూడా 12 % ఈక్వీటీ వాటా ప్రభుత్వానికే దక్కుతుందనే, ఆలోచన లేకుండా, అవగాహాన రాహిత్యంతో మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులు ‘95 % పూర్తయ్యాయి’ అనే వైసీపీ నేతల ప్రచారం పూర్తిగా అవాస్తవం. గత ఐదేళ్లలో రామాయపట్నం పోర్టు భౌతిక ప్రగతి కేవలం 50 శాతం మాత్రమే. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత వేగవంతంగా పనులు చేపట్టి, 20 నెలల్లో 80.50 % వరకూ పూర్తి చేశాం… భూసేకరణను కూడా గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేయగా, తామే పూర్తి చేశామన్నారు.. మొత్తంగా గత రెండేళ్లలోనే సుమారు 30 % అదనపు ప్రగతి సాధించామని వెల్లడించారు.. పోర్టు విస్తరణకు భూములును ఎకరా రూ. 1 కే ఇచ్చేస్తున్నారనడం కూడా ప్రజలను భయాందోళనలకు గురిచేసే రాజకీయ దుష్ప్రచారం మాత్రమేనన్నారు. ఇది సాధారణ భూమి విక్రయం ఎంత మాత్రం కాదని, దీర్ఘకాలిక కన్సెషన్ ఒప్పందంలో భాగంగా పెట్టుబడులు, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వానికి నిరంతర ఆదాయం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన విధానమని తెలిపారు. 12 % నాన్-డైల్యూటబుల్ ఈక్విటీ ద్వారా ప్రతి దశలోనూ ప్రభుత్వానికి వాటా ఉంటుందన్నారు.. యాజమాన్యం హక్కులు మాత్రం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయనే విషయం గుర్తించుకోవాలన్నారు.

పీపీపీ అంటే “అమ్మకం” ఎంత మాత్రం కాదు… రాష్ట్రానికి లాభం తీసుకొచ్చే అభివృద్ధి భాగస్వామ్యం (PPP) మాత్రమే.. నేడు గ్లోబల్ గా ఇదే విధానం విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. PPP విధానంలోనే నేడు దేశంలోని అధిక శాతం పోర్టులు పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న PPP విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తే అది తప్పు ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు. ? దేశం మొత్తంలో నేడు 119 పోర్టులు పనిచేస్తుండగా, వీటిలో 108 పోర్టులు, అంటే దాదాపు 91 %, PPP విధానంలోనే నిర్వహించబడుతున్నాయి… ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న అన్ని నాన్-మేజర్ పోర్టులు PPP నమూనాలోనే ఆఫరేషన్లు సాగుతున్నాయి… గుజరాత్‌లో కూడా దాదాపు 90 శాతం పోర్టులు PPP విధానంలోనే విజయవంతంగా నడుస్తున్నాయి. దేశమంతా అనుసరిస్తున్న విధానం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే తప్పు అని ప్రతిపక్షం విమర్శలు చేయడం ప్రజలను మోసం చేయడమే.

ఆంధ్రప్రదేశ్‌లో PPP విధానం ఈరోజు కొత్తగా ప్రారంభమైనది కాదు. 29 ఏళ్లుగా ఇదే నమూనాలో కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం వంటి పోర్టులు విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఈ పోర్టుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలకు, ఉపాధికి ఎంతో మేలు జరిగిన మాట వాస్తవం.. గత ఐదేళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ PPP విధానాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు ? అప్పట్లో మంచిగా కనిపించిన విధానం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా చెడ్డదిగా ఎలా మారిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పీపీపీ విధానంను అనుసరించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేదో ద్రోహామన్నట్లు ప్రవర్తిస్తున్న మీ రెండు నాల్కల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారనే విషయం మర్చిపోవద్దు…

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు అభివృద్ధి చేస్తున్న మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే దాదాపు రూ. 50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై మొత్తం ఆర్థిక భారం వేయకుండా, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడుతూ, ప్రపంచస్థాయి పోర్టులను నిర్మించడమే PPP విధానం లక్ష్యమన్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయి, వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పడతాయి, ఎగుమతులు పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామి మారిటైమ్ హబ్‌గా ఎదుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు..

మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులను ఇష్టారీతిన ప్రైవేటు సంస్థలకు తెగనమ్మితే.. తాము మాత్రం పారదర్శక టెండర్లతో, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, ప్రజలకు ఉద్యోగాలు వచ్చేలా, రాష్ట్ర భవిష్యత్తు బలపడేలా ఒప్పందాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.. అదే మీ పాలనకు… మా పాలనకు ఉన్న ప్రధాన వ్యత్యాసమని మంత్రి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *