– ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా పారదర్శకంగా పంపిణీ
– జిల్లాలో అందుబాటులో 8,185 మెట్రిక్ టన్నుల యూరియా
– క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు
– ఏ సమస్య ఉన్నా కాల్ టు కలెక్టర్ 91549 70454
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో అందేలా జిల్లా యంత్రాంగం పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతోందని.. అన్నదాత అవసరాలకు అనుగుణంగా పారదర్శక విధానంతో ఎరువులను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ గురువారం తిరువూరులో ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, సరఫరా పరిస్థితి, రైతులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ప్రస్తుత అవసరాలను తీర్చేందుకు జిల్లాలో తగినంత ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. పీఏసీఎస్‌ల వద్ద 3,319 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు ఎరువుల విక్రేతల వద్ద 4,866 మెట్రిక్ టన్నులు మేర యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా పీఏసీఎస్‌ల వద్ద 816 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు ఎరువుల విక్రేతల వద్ద 773 మెట్రిక్ టన్నుల డీఏపీ అందుబాటులో ఉందన్నారు. ఏ ఒక్క రైతూ ఇబ్బందిపడకుండా ఏర్పాట్లు చేశామని, వేసిన పంటకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీఎయిమ్స్) యాప్ ద్వారా ఎరువులకు సంబంధించిన సేవలతో పాటు సమగ్ర వ్యవసాయ సేవలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. నిరంతర పర్యవేక్షణతో ఎరువుల సరఫరాలో ఎక్కడా ఇబ్బంది అనేది లేకుండా చూడాలని జిల్లాస్థాయి అధికారులతో పాటు ప్రత్యేక అధికారులు, క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ 2 నుంచి 3 ఎరువుల దుకాణాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేశామన్నారు. యూరియా, ఇతర ఎరువుల శాస్త్రీయ సమతుల్య వినియోగంతో పాటు ఏపీ ఎయిమ్స్ యాప్, పంట వైవిధ్యం, నానో ఎరువులు, డ్రోన్ స్ప్రేయింగ్ తదితరాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎరువులు పక్కదారి అనే మాట రాకూడదని.. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాలు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఎరువుల సరఫరా, పంపిణీ లేదా ఇతర వ్యవసాయ సంబంధిత సమస్యలు ఎదురైన సందర్భంలో రైతులు కాల్ టు కలెక్టర్ నంబర్ 91549 70454కు సంప్రదించి తమ సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు. ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన అనంతరం కలెక్టర్ లక్ష్మీశ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తిరువూరు బోర్డర్ చెక్‌పోస్టును సందర్శించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీశ దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ వెంట తిరువూరు ఆర్డీవో ఎ.కుమార్, తహసీల్దార్ చంద్రమౌళి తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News