-పీఎంఏజీవై కింద మంజూరైన నిధులను సత్వరమే వినియోగించి పనులు పూర్తి చేయాలి
-ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన (PMAGY) పథకం కింద ఎంపికైన ఆదర్శ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగించి నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు.
విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పీఎంఏజీవై పథకం సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధే ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకమైన ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 100 శాతం గ్రాంట్‌ను అందజేస్తుందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు, సామాజిక-ఆర్థిక అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి పది కీలక రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టడమే పథకం ఉద్దేశ్యమని వివరించారు. జిల్లాలోని 16 మండలాల్లో 2018-19 నుండి 2025-26 మధ్య (2021-22 మినహా) ఐదు దఫాలుగా మొత్తం 84 గ్రామాలను ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 2018-19 నుండి 2020-21 వరకు ఫేజ్-1లో ఎంపికైన 33 గ్రామాల అభివృద్ధి కోసం రూ.6,05,63,908 మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.1,43,62,549 వ్యయం చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.4,62,01,359 నిధులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 2022 నుండి 2025-26 వరకు ఎంపికైన 51 గ్రామాలకు సంబంధించి మొత్తం 359 అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రతి ఆదర్శ గ్రామానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.1,020 లక్షల నిధులు అవసరమవుతాయని తెలిపారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు రూ.1,340.45 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా శాఖకు రూ.270.05 లక్షల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. నిధులను సకాలంలో వినియోగించి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదర్శ గ్రామాల్లో సోలార్ లైట్ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎస్సీ వర్గాల నివాస ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, అంతర్గత రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, పారిశుధ్య మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి నిజమైన ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, సాంఘిక సంక్షేమం తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాధాన్యత క్రమంలో నిధులను వినియోగించి అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధి ప్రణాళిక ప్రకారం పనుల అమలును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆర్.సి. ఆనంద్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.శ్రావణ బాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి.జ్యోతిలక్ష్మి దేవి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News