-పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అత్తిలిలో లేస్, నేత కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు
-15 మందికి త్వరలోనే క్యాటరాక్ట్ శస్ర్తచికిత్స
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హస్తకళాకారుల చేతుల్లో కళ బతకాలంటే… వారి కళ్లల్లో వెలుగులు చిరకాలం నిలవాలన్న సంకల్పంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హస్త కళాకారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం వేదికగా కళాకారులకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొస్తూ ఇప్పటి వరకు కొండపల్లి, నరసాసాపురం, పాలకొల్లు, బొబ్బిలి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. కళాకారుల ఆరోగ్యమే వారి కళకు బలమనే భావనతో నిరంతరం ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. కంటి పరీక్షల నుంచి అవసరమైన మందులు, కళ్లద్దాలు, శస్త్రచికిత్సల వరకు పూర్తిస్థాయి వైద్య సహాయాన్ని ఉచితంగా అందిస్తూ హస్తకళాకారుల జీవితాల్లో ఆరోగ్య భరోసా నింపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఆ ప్రాంత లేస్, నేత కళాకారుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో మొత్తం 143 మంది కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి త్వరలోనే ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 110 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించగా, వారికి ఉచితంగా కళ్లద్దాలను అందించనున్నారు. మరో 18 మంది కళాకారులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.
Prajavartha Online Telugu News