-ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలోని ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగాయి. తెల్లవారుజామునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రి శుభ సందర్భంగా మంగళవారం ముత్యాలంపాడులోని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు సందర్శించారు. ఈ సందర్భంగా శివాలయంలో రుద్రాభిషేకం, రుద్రహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. గతంలో దేవాలయాలను కూల్చిన ప్రభుత్వాలను చూశామని.. కానీ దేవాలయాలను పునర్నిర్మించడమే కాకుండా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మల్లాది విష్ణు తెలిపారు. దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణ పద్ధతులు తీసుకురావడంలో భాగంగా.. టీటీడీలో అమలుచేస్తున్న విధానాలను ఇతర దేవాలయాల్లోనూ ప్రవేశ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాల కల్పనలోనూ ఎక్కడా రాజీ పడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని మల్లాది విష్ణు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం, ఆలయ కమిటీ ఛైర్మన్ ధాట్ల వెంకట నరసింహరాజు, సెక్రటరీ శివరామరాజు, కమిటీ సభ్యులు, యల్లాప్రగడ సుధీర్ బాబు, భక్తులు పాల్గొన్నారు.