– ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం…త్వరలో అదనపు జీవో.
– జీఎస్టీ, హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణ ఖర్చు రూ.336 కోట్లు.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల మీద భారం లేకుండా, సినీ పరిశ్రమకు ఇబ్బందిలేకుండా సినిమా టిక్కెట్ల అదనపు రేట్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సినిమాటోగ్రఫీ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. రాజమౌళి డైరెక్టర్ గా RRR సినిమా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు వచ్చిందని, ఆ దరఖాస్తును స్క్రూటినీ చేసి దానికి అదనంగా ఎంత రేటు ఇస్తుందో త్వరలోనే ప్రభుత్వం జీవో ఇస్తుందని ప్రకటించారు. గురువారం నాడు వెలగపూడి సచివాలయం బ్లాక్ 2 వద్ద మంత్రి పేర్ని నాని మీడియా ప్రతినిధులకు వివరాలను వెల్లడించారు. ఏపీలో షూటింగ్ కి కావాల్సిన పర్మిషన్లన్నీ సింగిల్ విండో విధానంలో ఉచితంగా ఇస్తున్నామని, తెలంగాణలో గానీ, ఉత్తర భారతదేశంలో గానీ ఫీజులు తీసుకుంటారని తెలిపారు. ఏపీలో సినిమా షూటింగులను ప్రొత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడూతూ.. మార్చి 7వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ 13 ద్వారా సినిమా థియేటర్లలో ఏ ఏ ప్రదేశాల్లో ఏ సినిమా హాళ్లలో రేట్లు ఎలా ఉండాలని టిక్కెట్ రేట్ల ఫిక్స్ చేసి జీవోలో పొందుపర్చడం జరిగిందన్నారు. సినిమా హీరో, దర్శకుడు, హీరోయిన్ ముగ్గురి రెమ్యునరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు బడ్జెట్ దాటితే వాటిని పరిశీలించి దానికి అదనంగా టికెట్ రేటు ఎంత వసూలు చేసుకోవచ్చనే నిర్ణయంపై జీవోలోనే పొందుపర్చడం జరిగిందన్నారు. రాజమౌళి డైరెక్టర్ గా RRR సినిమా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు వచ్చిందని, జీఎస్టీ కాకుండా, హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి రూ. 336 కోట్ల ఖర్చు అయినట్లు వివరాలన్నీ ప్రభుత్వానికి అందజేశారని, జీఎస్టీ డిపార్ట్ మెంట్ గానీ, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, హోం సెక్రటరీ వీరంతా ఆ వివరాలపై స్క్రూటినీ చేస్తున్నారని మంత్రి తెలిపారు. త్వరలోనే ఫైల్ ముఖ్యమంత్రి వద్దకు వెళ్తుందని, నిర్మాణం చేసిన వ్యయానికి ఎంతవరకూ అదనంగా రేటు ఇవ్వొచ్చనని ప్రభుత్వం అంతా పరిశీలించి త్వరలోనే జీవో విడుదల చేస్తుందని వెల్లండిచారు. ప్రజల మీద భారం కాకుండా, నిర్మాణ వ్యయం విపరీతంగా ఉన్నప్పటికీ సినిమా విడుదలైన 3, 4 రోజుల్లోనే వసూలు చేసేవిధంగా కాకుండా నిర్ణయం తీసుకుంటారని, జీవో నెంబర్ 13 ప్రకారం మొదటి 10 రోజుల వరకూ అని పేర్కొన్నామని తెలిపారు.
ఎంత ఖర్చు పెట్టారనేది జీఎస్టీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ స్క్రూటినీ చేస్తుందని, కమిటీని, రూల్స్ ను జీవోలో పొందుపర్చామని మంత్రి పేర్ని నాని తెలిపారు. హోం సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం ప్రభుత్వం రేట్లను నిర్ణయిస్తుందన్నారు. జీవో కంటే ముందే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమాలకు 20 శాతం షూటింగ్ రాష్ట్రంలో చేసి ఉండాలన్న నిబంధన నుంచి మినహాంపు ఇస్తున్నామని, కొత్తగా నిర్మించే సినిమాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. ఆన్ లైన్ టిక్కెట్ విధానంలో టెండర్లు పూర్తయ్యాయన్నారు. టెండర్లలో రెండు కంపెనీలు పాల్గొన్నాయని, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా ఏప్రిల్, మే నెలల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు థియేటర్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యన ఐదు షోలు ప్రదర్శించవచ్చనని.. అయితే చిన్న సినిమాలు విడుదలైతే.. తప్పనిసరిగా ఆ సినిమాకు ఓ షో వేసుకునేలా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటలలోపు వీలు కల్పించాలని తెలిపారు. రూ.20 కోట్లు బడ్జెట్ లోపు ఉన్న ప్రతి సినిమా చిన్న సినిమానే మంత్రి తెలిపారు.