విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అసాంఘిక శక్తులైన బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్లు మరియు మత్తు పదార్ధాలు సేవించేవారిని కట్టడి చేసేందుకు గాను రైల్వే జి ఆర్ పి, ఆర్.పి.ఎఫ్.వారితో నగర పోలీస్ కమీషనర్ జాయింట్ అపరేషన్ నిర్వహించారు. డిజిపి వారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో అత్యంత ప్రాముఖ్యత గల రైల్వే శాఖకు సంబంధించిన ఖాళీ ప్రదేశాలను, వాడుకలో లేని కట్టడములను అడ్డాలుగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ రైల్వే ఆస్తులను పాడుచేసే వ్యక్తులను కట్టడి చేసేందుకు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్, సీనియర్ డివిజనల్ రైల్వే సెక్యూరిటి కమీషనర్ బి.టి.వల్లేశ్వర్ తో కలిసి సోమవారం విజయవాడ రైల్వే స్టేషన్ నుండి రైల్వే ట్రాక్ పై ప్రత్యేక వాహనంలో రైల్వే ట్రాక్ పరిసరాలను పరిశీలించారు. రైల్వే శాఖకు చెందిన ప్రదేశాలలో అక్రమముగా ప్రవేశించుటకు అనువుగా వున్న 9 ప్రాంతాలను గుర్తించారు. రైల్వేకు చెందిన ట్రాక్స్, లోకో షేడ్స్ పాడుబడిన క్యాబిన్లు, బోగిలను ఆవాసాలుగా చేసుకొని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రైళ్ళలో చోరిలకు పాల్పడే వ్యక్తులపై ఉక్కు పాదం మోపాలని, నేరాల కట్టడికి జి.ఆర్.పి., ఆర్.పి.ఎఫ్ తో కలిసి నిరంతర నిఘాను ఏర్పాటు చేసి అట్టివారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ ను ఏర్పాటు చేస్తున్నామని అందులో బాగంగా రైల్వే ఆస్తులకు సంబంధించిన ప్రదేశాలలో ఆ శాఖ బాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైనంత సిబ్బందిని ఏర్పాటు చేసి గస్తీ ముమ్మరం చేసి అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తామని నగర పోలీస్ కమీషనర్ శ్రీ. కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ జోన్ డి.సి.పి.. కె.బాబురావు ఐ.పి.ఎస్., నిఘా విభాగానికి చెందిన ఏ.డి.సి.పి.. సి.హెచ్. లక్ష్మిపతి, పశ్చిమ డివిజన్ ఏ.సి.పి. డా. కె.హనుమంత రావు, నార్త్ డివిజన్ ఇన్ ఛార్జ్ ఏ.సి.పి.. జి.వి.రమణ మూర్తి., ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …