-వ్యవసాయశాఖామాత్యులు కాకాని గోవర్ధరన్‌రెడ్డి వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పామాయిల్ కంపెనీలు రాష్ట్రంలో రైతుల నుండి సేకరించే పామాయిల్ గెలల ధరను ఈ నెల 13న జరిగే ధరల నిర్ణయాక కమిటీ సమావేశంలో నిర్ణయిస్తామని వ్యవసాయాశాఖామాత్యులు కాకాని గోవర్థన్‌రెడ్డి తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ నేడొక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో గత కొన్ని నెలలనుండి పామాయిల్ రైతులనుండి కంపెనీలు కొనుగోలు చేసే ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించకపోవడం వల్ల రైతులు ప్రతి టన్నుకు 1000 నుండి 1500 రూపాయలు నష్టపోతున్నారు. తెలంగాణా ప్రభుత్వం ప్రతి నెలా మొదటి వారంలో రేటు నిర్ణయించి ప్రకటిస్తుంది. తెలంగాణాలో టన్ను 22900 రూపాయలకు కంపెనీలు రైతులనుండి కొనుగోలు చేస్తుంటే మన రాష్ట్రంలో 21500 రూపాయల మేర రైతులకు ధర వస్తున్నదని రైతులు తమదృష్టికి తేగా ఫోన్ ద్వారా వ్యవసాయ మంత్రికి తెలియపర్చామని ప్రసాద్ వివరించారు. అదే విధంగా పామాయిల్ కంపెనీలు రైతాంగానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కె.వి.వి.ప్రసాద్ మంత్రి దృష్టికి తెచ్చారు. పామాయిల్ రైతుల సమస్యలను ఆ సమావేశంలో చర్చిస్తామని మంత్రి ప్రకటించారు. రైతుల సమస్యలు చర్చించేందుకు చొరవ తీసుకున్న మంత్రి గోవర్థన్ రెడ్డికి కె.వి.వి.ప్రసాద్ అభినందనలు తెలిపారు.