-డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ బుధవారం అధికారులతో కలసి క్రీస్తురాజపురం, వెటర్నరి కాలనీ తదితర ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ, డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల మరియు రిజర్వాయర్ నిర్వహణ విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. క్రీస్తురాజపురం మెయిన్ రోడ్ మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము పరిశీలించిన సందర్భంలో ఇంకను మెయిన్ రోడ్ శుభ్రపరచకపోవుట గమనించి, ఉదయం వేళల్లో మస్తరు అయిన వెంటనే సిబ్బంది ప్రధాన రహదారులను శుభ్రపరచిన తదుపరి అంతర్గత రోడ్లు మరియు ఇంటింటి చెత్త సేకరణ నిర్వహించేలా చూడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా క్రీస్తురాజపురం క్రాస్ రోడ్ నందు ఇటివలే వేసిన రోడ్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. తదుపరి వెటర్నరి కాలనీ నందలి డ్రెయినేజి పంపింగ్ స్టేషన్, డ్రెయిన్స్ పారుదల విధానము మరియు రిజర్వాయర్ నిర్వహణ తీరు పర్యవేక్షించిన సందర్భంలో స్థానికులు పంపింగ్ స్టేషన్ నుండి దుర్వాసన వస్తుందని కమిషనర్ దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారం కొరకు డ్రెయినేజి పంపింగ్ స్టేషన్ నందు బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా వెటర్నరి కాలనీ నందలి వాటర్ ట్యాంక్ శుద్ధి చేయు వివరాలతో కూడా బోర్డు అందుబాటులో లేకపోవుట గమనించి రికార్డు లను సక్రమముగా నిర్వహించుటతో పాటుగా విధిగా ప్రతి రిజర్వాయర్ నందు సదరు ట్యాంక్ ఎప్పుడు శుభ్రపరస్తున్నది వంటి వివరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రిజర్వాయర్ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న స్క్రాప్ నంతటిని అక్కడ నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీ దేవి మరియు ఇతర అధికరులు, సిబ్బంది పాల్గొన్నారు.