-ఆకట్టుకున్న క్రీడాకారుల ప్రదర్శనలు
-గుండెల్లో ధైర్యం ఒంట్లో సత్తా నింపుకొని బరిలో చెలరేగి ఆడాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన రాష్ట్రం నుండి గతంలో కంటే ఈ సారి చాల ఎక్కువ మంది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ఎంపిక అవడం అభినందనీయం అని క్రీడా మంత్రి అన్నారు . హర్యానాలో జరుగబోతున్న 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొంటున్న 160 మంది క్రీడాకారులకు రాష్ట్ర పర్యాటక, యువజనాభ్యుదయ, సాంస్కృతిక, క్రీడల శాఖా మంత్రి ఆర్.కె. రోజా శుభాకాంక్షలు తెలియజేసారు. శాప్ ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన ఖేలో ఆంధ్రా జయహో ఆంధ్రా కార్యక్రమమంలో మంత్రి రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ …. గతములో కంటే కూడా ఈ సారి చాలా ఎక్కువ మంది 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు ఎంపిక అవ్వడం ఆనందముగా ఉందన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో మన రాష్ట్రము నుండి ఎంపికైన క్రీడాకారులు పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ కు మంచి పేరు తీసుకురావాలన్నారు. 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు మేము కూడా వచ్చి మీ అందరిని ఉత్సాహపరుస్తామన్నారు. సిద్దార్థ రెడ్డి శాప్ చైర్మన్ అయ్యిన తరువాత స్పోర్ట్స్ లో చాలా మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి క్రీడలు రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చెయ్యాలి అనే దాని కోసం ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు . క్రీడల అభివృద్ధికి జూన్ మొదటి వారంలో ఒక మీటింగ్ నిర్వహించబోతున్నామని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ముఖ్యముగా యూత్ కి, క్రీడలకు, క్రీడాకారులకు సపోర్ట్ ఇవ్వాలని చిత్తశుద్దితో ఉన్నారన్నారు. అలాగే కొత్త కొత్త క్రీడలు ఈరోజు వింటుంటే ఎప్పుడు వినని క్రీడలు కోచ్ లు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో సిన్సియర్ గా మన భారతదేశానికి సంబంధించిన గేమ్స్ బయటకి తీసుకువచ్చి పిల్లలకి నేర్పించి దాని ద్వారా మన గేమ్స్ ని ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి వాటిలో మనం బెస్ట్ గా ఉండాలనే ప్రయత్నం మనం అభినందించాల్సిన విషయమని అన్నారు. క్రీడాకారులకు నేను ఒక్కటే చెప్పగలను మీరు కనుక పతకం సాధించాలని గుండెల్లో ధైర్యం నింపుకొని మీ ఒంట్లో సత్తా అంతా కూడా ఉపయోగించి గ్రౌండ్ లో అందరు చెలరేగి ఆడితే తప్పక మీకే విజయం లభిస్తుందన్నారు. అలాగే భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ కి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు
మీ కష్టాన్ని నమ్ముకొని ఆడండి: చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరికి ముందుగా నా శుభాకాంక్షలు… ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికి నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఒక సినిమా యాక్టర్ కి కొంత వరకు క్రేజ్ ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడకు కొంత క్రేజ్ ఉంటుంది, కానీ ఒక క్రీడాకారుడికి ఉన్నటువంటి క్రేజ్ ఇంక ఎవరికీ ఉండదన్నారు. అలాగే ఓవర్ నైట్ స్టార్ లు అయ్యే వారు ఎవరు ఉండరన్నారు. ఏ ఫీల్డ్ లో విజయం సాధించాలన్న కొన్ని సంవత్సరాల కష్టం, శ్రమ కావాలన్నారు. దానికి ఉదాహరణ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరు రోజా గారు, ఇంకొకరు షెక్ జాఫ్రిన్ గారు. రోజా గారు ఒక యాక్టర్ గా, ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక యం.ఎల్.ఏ గా ఎన్నో సంవత్సరాల కష్టపడితే మన ముందు మంత్రిగా వచ్చి నిలిచిందన్నారు. అలాగే డెఫ్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన షెక్ జాఫ్రిన్ గారు ఫైనాన్షియల్ గా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మన భారతదేశం తరపున ఆడి ఈ రోజు మనమందరం గర్వించే విధముగా ఒక మెడల్ సాధించింది అంటే ఎంత కష్టపడిందో మీ అందరు ఒక్కసారి ఆలోచించాలన్నారు. అలాగే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాకు ఆదర్శం, స్పూర్తి అన్నారు. ఎందుకంటే పార్టీ పెట్టిన 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో అవమానాలు, కష్టాలు పడి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. మీరు మీ కష్టాన్ని నమ్ముకొని ఆడితే పతకం సాధించగలరన్నారు. ఖేలో ఇండియా గేమ్స్ లో బాగా ఆడి సర్టిఫికేట్ సంపాదిస్తే స్పోర్ట్స్ కోటా కింద చేర్చి భవిష్యతులో ఉద్యోగాలు వచ్చే విధముగా శాప్ అవకాశం కలిపిస్తుంధన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రముఖ స్థానం కల్పించేందుకు మన క్రీడాకారులు చాలా కృషి చేశారు: ఎండీ డా. యన్. ప్రభాకర రెడ్డి
ఈ సంవత్సరం 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 హర్యానా లోని పంచకుల నగరములో 2022 జూన్ 3 నుండి 13వ తేది వరకు జరగనున్న క్రీడలకు మన రాష్ట్రము నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 160 మంది క్రీడాకారులందరికి మంత్రి గారి ఆధ్వర్యములో ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతూ క్రీడాకారులకు వీర తిలకం దిద్దటం జరిగిందన్నారు….. ఇటీవల అంతర్జాతీయ వేదికల మీద మన క్రీడాకారులే భారతదేశ కీర్తిని ఎలుగెత్తి చాటారు. వారం రోజులలోనే అనేక పతకాలు సాధించారు. పరుగు పందెంలో యర్రా జ్యోతి, థామస్ కప్ బ్యాడ్మింటన్ లో కిదాంబి శ్రీకాంత్, రాంకి రెడ్డి, రైఫిల్ షూటింగ్ లో మద్దినేని ఉమా మహేష్, ఆర్చరీలో ప్రపంచ మూడో ర్యాంక్ లో జ్యోతి సురేఖ, ట్రిపుల్ జంప్ లో మల్లాల అనుష, అండర్ 11 చెస్ విభాగంలో చిన్నారి కోలగట్ల అలనమీనాక్షి.. ఇలా ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల మీద తమ సత్తా చాటారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు షైక్ జాఫ్రిన్ చూసి గర్విస్తోంది. డెఫ్ ఒలింపిక్స్ లో పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి కారణమైనటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ కావటం మనకు ఎంతో గర్వకారణం అన్నారు. ఈ ఏడాదిలో భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ కు ప్రముఖ స్థానం కల్పించేందుకు మన క్రీడాకారులు చాలా కృషి చేశారన్నారు. క్రీడా మంత్రి రోజా, శాప్ చైర్మన్ సిద్దార్థ రెడ్డి ఎంతో ఉత్సాహంతో క్రీడల అభివృద్దికి కావాల్సిన కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడైనా క్రీడాకారులు ఇబ్బంది పడితే వాటిని సవరించటానికి చర్యలు తీసుకొంటున్నారన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సగర్వంగా ప్రకటిస్తోంది ఈ రాష్ట్రంలో క్రీడలు రాష్ట్ర గౌరవాన్ని, దేశ గౌరవాన్ని నిలబెట్టటంలో ముందుంటుందన్నారు.
ఔరా అనిపించిన విన్యాసాలు…
కార్యక్రమములో కొన్ని క్రీడల ప్రదర్శన లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందులో బాక్సింగ్, ఘట్కా, జిమ్నాస్టిక్, తాంగ్-ట, మల్ల కంబ వంటి క్రీడలను ఎంతో అద్భుతముగా క్రీడాకారులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శన మంత్రి రోజా, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి తిలకిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే మంత్రి రోజా గారు, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి టేబుల్ టెన్నిస్ మరియు ఘట్కా ఆటలు ఆడి క్రీడాకారులను ఆనందింపజేశారు.
ప్రత్యేక ఆకర్షణగా భీమవరం విద్యార్థులు చేసిన మల్లఖాంబ్…
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యార్థులు చేసిన మల్లఖాంబ్, రోప్ స్కిప్పింగ్ లు చూపరులను కట్టిపడేశాయి. మల్లఖాంబ్ క్రీడ మధ్యప్రదేశ్ కి చెందిన క్రీడ అని, వీటిలో పోల్ మల్లఖాంబ్, రోప్ మల్లఖాంబ్ అని రెండు రకాలుంటాయని కోచ్ జీ.పీ.సీ. శేఖర్ రాజు తెలిపారు. కోచ్ శేఖర్ రాజుకి మంత్రి, శాప్ ఛైర్మన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మల్లఖాంబ్ వంటి క్రీడలకు ప్రోత్సాహానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్రీడల్లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తారన్నారు. మల్లఖాంబ్ క్రీడాకారులతో మంత్రి రోజా సెల్ఫీ తీసుకున్నారు.
ఇది మరిచిపోలేని జ్ఞాపకం…
ఒక కోచ్ మాట్లాడుతూ… ఖేలో ఇండియా ఆటలకు ఎంపికైతే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటి సారి అని అన్నారు. ఈ అనుభూతిని మరిచిపోలేమని పేర్కొన్నారు .ఖేలో ఇండియా అంటే మన గవర్నమెంట్ లో ఇంతకుముందు ఎప్పుడు గుర్తింపు లేదు, కానీ ఇప్పుడు శాప్ గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు చెయ్యటం ఎంతో ఆనందముగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యతులో మరెన్నో చేయాలని కోరుకుంటున్నానన్నారు. చాలా మంది ఖేలో ఇండియా అంటే మనం అడగలమా అని అనుకుంటారు, కానీ ఖేలో ఇండియా కి ఎంపిక అవ్వటానికి పిల్లలు ఎంత కష్టపడతారో ఒక కోచ్ గా మాకు తెలుసన్నారు. వాళ్ళకు ఎంత బాగా శిక్షణ ఇవ్వాలి, వాళ్ళలో భయాన్ని ఎలా పోగొట్టాలి అనేది ఒక కోచ్ కు మాత్రమే తెలుసునన్నారు.
19 క్రీడాంశములు: 1. ఆర్చరీ, 2. అథ్లెటిక్స్, 3. బ్యాడ్మింటన్, 4. బాక్సింగ్, 5. సైక్లింగ్, 6. ఘట్కా, 7. జిమ్నాస్టిక్, 8. హ్యాండ్ బాల్, 9. జూడో, 10. కబడ్డీ, 11. ఖో-ఖో, 12. మల్ల కంబ, 13. షూటింగ్, 14. స్విమ్మింగ్, 15. టేబుల్ టెన్నిస్, 16. టెన్నిస్, 17. తాంగ్-ట, 18. వెయిట్లిఫ్టింగ్, 19. రెస్లింగ్.
ఈ కార్యక్రమములో, శాప్ పరిపాలనాధికారి పి. రామకృష్ణ, శాప్ బోర్డు మెంబెర్స్, క్రీడా అధికారులు, కోచ్ లు, క్రీడా సంఘాల ప్రతినిధులు మరియు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.