-ప్రభుత్వ ఆసుపత్రిపై చులకన భావాన్ని పోగొట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నామన్న భావన కల్పించండి…
-ఏ సమయంలోనైన ఆకస్మిక తనిఖీ చేస్తా.. నిర్లక్ష్యం వహిస్తే సహించను…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యులు సిబ్బంది రోగుల మధ్య స్నేహపూరిత వాతావారణంలో మెలుగుతూ సేవలను మరింత మెరుగు పరచాలని ఏ సమయంలోనైనా తాను ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించనని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. విజయవాడలోని నూతన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సందర్శించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బలహీనవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొట్లాదిరూపాయల నిధులను కేటాయించి ఆసుపత్రులను అభివృద్ధి చేస్తుందన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ, డ్రగ్ కంట్రోల్‌పై సంబంధిత అధికారులు పూర్తి పర్యవేక్షణ చేయాలని ఈ విషయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ తెలిపారు. రోగులకు వైద్య సహాయం అందించడంలో ఆసుపత్రి అధికారులు నిరంతర పర్యవేక్షణను కలిగి వుండాలన్నారు. అధికారులు ఎంత అప్రమత్తంగా ఉంటే సిబ్బంది అంత ఉత్సాహంగా పనిచేయగలుగుతారన్నారు. ముఖ్యంగా వైద్యాధికారులు, సిబ్బందికి సమయపాలన అత్యంత ముఖ్యమైనదన్నారు. పనివేళల్లో సమయాన్ని పాటించని వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. సిబ్బంది హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ వ్వవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యాధికారులు సిబ్బంది మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఆసుపత్రులలో వార్డు బాయ్‌లు, ఆయాలు, రోగుల నుండి డబ్బులు అడుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఇకపై ఇటువంటి వాటిని కట్టడి చేయాలని లేదంటే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజల్లో ఉన్న చులకన భావనను పోగొట్టి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఉన్నామన్న వాతావరణాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పించేందుకు కృషి చేయాలన్నారు. నర్సింగ్ విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో సేవలు అందించేలా నర్సింగ్ సూపరిండెంటెంట్ పర్యవేక్షించాలన్నారు. ఆసుపత్రిలో పనిచేయని వైద్య పరికరాలకు గల కారణాలు వాటికి మరమత్తులు చేసేందుకు అంచనాలతో కూడిన నివేదికను వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆసుపత్రి సూపరిండెంటెంట్‌ను ఆదేశించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి పూర్తి వేతనం చెల్లించడంలేదనే ఆరోపణలు ఉన్నాయని మీడియా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృషికి తీసుకురాగా దీనిపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఏఆర్‌టి సెంటర్‌లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు తీసిన ఎక్సెరేతీసిన ఫిల్మ్‌ను తిరిగి రోగులకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
తొలుత జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆసుపత్రి వైద్యాధికారులతో కలిసి పలు వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి రోగుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరిండెంటెంట్ డా. బి.సౌభాగ్యలక్ష్మి, ఆర్‌యంవోలు డా.యు శోభ, డా. మంగదేవి, డా.గొపిచంద్, డా.కిరణ్‌కుమార్, డా. వెంకట కృష్ణ, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు నర్సింగ్ సూపరిండెంటెంట్, సిబ్బంది ఉన్నారు.