Breaking News

నవరత్నాలు, పేద‌ల‌ సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం సందడి వాతావరణంలో కొనసాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ జానారెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రామకృష్ణాపురంలోని నెమలికంటి సీతాదేవి రోడ్డు, వానపాల వారి వీధి, మసీదు వీధి, అయ్యప్ప వీధులలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు స్థానికులు సాదర స్వాగతం పలికారు. పేదల కోసం నిర్మిస్తోన్న ఇళ్లను రూ. 2.15 లక్షలకే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా దాదాపు 450 ఇళ్లను వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే సందర్శించి.. మూడేళ్ల పాలనలో అందించిన సంక్షేమంపై బుక్ లెట్ల ద్వారా వివరించారు. స్థానికుల నుంచి అర్జీలు, సూచనలు స్వీకరించారు. సమస్యలను తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. శానిటేషన్ సిబ్బంది రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. కట్ట వెంబడి పిచ్చిమొక్కలను తొలగించి.. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు. రామకృష్ణాపురంలో రూ. 80 లక్షలతో నూతన యూజీడీ పైపు లైన్ పనులకు ఇటీవల శంకుస్థాపన నిర్వహించుకోవడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. యూజీడీ పైపు లైన్ పనుల అనంతరం రామకృష్ణాపురం నుంచి ఉలవచారు కంపెనీ మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు కలుపుతూ ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా దేవీన‌గ‌ర్ నుంచి ఉల‌వ‌చారు కంపెనీ వ‌ర‌కు ర‌హ‌దారి నిర్మాణానికి టెండ‌ర్లు ప్రక్రియ పూర్తి అయిందని తెలిపారు.

నవరత్నాలతో పెద్దఎత్తున ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 246 వ సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 2.05 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 262 మందికి ప్రతినెలా రూ. 6.90 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. చేయూత ద్వారా 64 మందికి రూ. 12 లక్షలు., కాపు నేస్తం ద్వారా 9 మందికి రూ. 1.35 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 77 మందికి రూ.11.55 లక్షలు., అమ్మఒడి ద్వారా 192 మందికి రూ. 26.88 లక్షలు., విద్యాదీవెన ద్వారా 56 మందికి రూ. 16.80 లక్షలు., వాహనమిత్ర ద్వారా 13 మందికి రూ. 1.30 వేలు, వైఎస్సార్ ఆసరా ద్వారా 280 మందికి రూ. 26.74 లక్షలు., సున్నా వడ్డీ ద్వారా 270 మందికి 4.56 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. అలాగే 30వ డివిజన్ లో అభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు రూ. 9.31 కోట్ల పనులు మంజూరైనట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వీటిలో రూ. 0.57 కోట్ల పనులు పూర్తి కాగా.. రూ. 5.78 కోట్ల పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. మరో రూ. 2.96 కోట్ల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో అర్హులకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఈ మూడేళ్లలో నియోజకవర్గంలో విద్యారంగానికి రూ. 100 కోట్లు, మహిళ సంక్షేమానికి రూ. 120 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గత తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకుంటే.. ఈ ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ పేదలకు అండగా నిలిచిందన్నారు. రాష్ట్ర అప్పుల గూర్చి మాట్లాడే ముందు కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పు చేయకుండా కేంద్రంలోని బీజేపీ పాలన సాగించగలదా..? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుందని.. జాతీయ స్థాయిలో వచ్చిన అవార్డులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్‌ లో కేంద్ర ప్రభుత్వమే ఏపీకి 13 అవార్డులు ప్రకటించిందని.. అలాంటప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని నడ్డా ఏవిధంగా మాట్లాడతారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలకు భిన్నంగా బీజేపీ జాతీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పొత్తుల విషయంలో రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ పిలుస్తుందా..? ఎవరి పంచన చేరదామా..? అని ఎదురుచూసే బీజేపీ కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా రాష్ట్రంలో జరుగుతోన్న సంక్షేమం, అభివృద్ధి బీజేపీ చలవేనంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులనే.. దామాషా ప్రకారం తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇవిగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించిన నిధులు ఏమైనా ఉంటే సోము వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈ (ఇంజనీరింగ్) గురునాథం, జోనల్ కమిషనర్ రాజు, నాయకులు భోగాది మురళి, సామంతకూరి దుర్గారావు, ముద్రబోయిన దుర్గారావు, మార్తి చంద్రమౌళి, సుబ్బారెడ్డి, గోపిశెట్టి శ్రీను, వానపాల రమేష్, పార్టీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *