Breaking News

రాష్ట్రంలో కొత్తగా ఐదు మెడికల్ కళాశాలలు… : ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే ఏడాది (2023–24) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఐదు మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు ప్రకటించారు.
గురువారం సాయంత్రం ఆయన మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), పలువురు అధికారులతో కలిసి కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల, నర్సింగ్ కశాళాల, బోధన తరగతుల భవనాలు, హాస్టల్ భవనాల ఏర్పాటుకు సంబంధించిన నిర్మాణ పనులను పరిశీలించి మరింత వీటి పనులు వడివడిగా సాగాలని అధికారులను ఆదేశించారు.
ఓ వైపు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చకచకా చేపడుతూనే వాటి కార్యకలాపాలు ప్రారంభించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.ఇందులో భాగంగా ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, నంద్యాల జిల్లా ఆసుపత్రులను బోధనాస్పత్రులుగా మార్పు చేసినట్లు తెలిపారు . జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు ఓ ఆస్పత్రికి బోధనాస్పత్రి స్థాయి లభించాలంటే 330 పడకలు ఉండాలి. ఈ ఆస్పత్రుల్లో బోధనాస్పత్రి ప్రారంభించడానికి సరిపడా పడకలు ఇప్పటికే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో.. వీటిని బోధనాసుత్రుల స్థాయికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఆస్పత్రిలో రూ.5 కోట్లతో అదనపు నిర్మాణాలను చేపడుతోందన్నారు.అదే విధంగా వైద్య కళాశాల కార్యకలాపాల కోసం ఒక్కోచోట రూ.38 కోట్లతో ప్రీ–ఇంజనీర్డ్ బిల్డింగ్స్ (పీఈబీ) నిర్మిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్లకు పనులు కేటాయించారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు లెక్చర్ హాళ్లు, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, అనాటమీ బ్లాకులతో పీఈబీలు నిర్మిస్తారని ఆయన తెలిపారు. .
ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్య రంగం బలోపేతంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ పార్లమెంట్ నియోజకర్గానికి ఒక వైద్య కళాశాల ఏర్పాటుచేసి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువచేయాలని సంకల్పించారన్నారు. అంతేకాక.. పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను చేరువ చేయాలనుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో.. రూ.16వేల కోట్లకు పైగా వ్యయంతో నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా ఓ వైపు ప్రస్తుతమున్న 11 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, ఇతర ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు 16 నూతన వైద్య కళాశాలల నిర్మాణం చేపడుతున్నారని వివరించారు.
రాష్ట్రంలో ఐదు కొత్త వైద్య కళాశాలల ప్రారంభంతో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే విద్యా సంవత్సరం (2023–24)లో పెరగనున్నాయిని తెలిపారు. ఇప్పటికే ఈ ఐదు ఆస్పత్రులను వైద్య విధాన పరిషత్ నుంచి డీఎంఈ పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ తుదిదశకు చేరుకుందన్నారు.ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఆయా ఆస్పత్రుల్లో ఎంతమంది వైద్యులు, వైద్య సిబ్బందిని సమకూర్చాల్సి ఉంటుందనే దానిపై అధికారులు సమీక్షిస్తున్నారని అర్హతను బట్టి ప్రస్తుతం ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని డీఎంఈ పరిధిలోకి తీసుకోవాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
అనంతరం మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ, 2023 ఆగష్టు నెలాఖరునాటికి వైద్య కళాశాల సిద్దమై సెప్టెంబర్ లో 150 సీట్లకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మొత్తం 2 లక్షల 60 వేల 603. 37 చదరపు మీటర్లలో 24 x 7 అక్యూట్ కేర్ బ్లాక్, ఓ పి డి బ్లాక్ , ఐ పి డి బ్లాక్ , డయాగ్నోసిస్ బ్లాక్, హాస్పిటల్ సర్వీస్ బ్లాక్ – 2 , మార్చురీ బ్లాక్ , ఎంపిజిఎస్, ధర్మశాల, అంబులెన్సు పార్కింగ్, డ్రైవర్స్ షెడ్ ,బయో మెడికల్ వేస్ట్ ప్లాంట్ , మెడికల్ కళాశాల, లెక్చర్ గ్యాలరీ, నర్సింగ్ కాలేజీ, యు జి గర్ల్స్ హాస్టల్ ( మొదటి సంవత్సరం విద్యార్థునులకు) , యు జి గర్ల్స్ హాస్టల్ (రెండవ సంవత్సరం విద్యార్థునులకు),
యు జి గర్ల్స్ హాస్టల్ (3 వ సంవత్సరం , 5 సంవత్సరం విద్యార్థునులకు) యు జి బాయ్స్ హాస్టల్ ( మొదటి సంవత్సరం విద్యార్థులకు ) , యు జి బాయ్స్ హాస్టల్ (రెండవ సంవత్సరం విద్యార్థులకు), యు జి బాయ్స్ హాస్టల్ (3 వ సంవత్సరం , 5 సంవత్సరం విద్యార్థులకు)ఎం రెసిడెంట్ హాస్టల్ ఫర్ మేల్, ఇంటెర్మ్ హాస్టల్ ఫర్ మేల్, మేల్ నర్సింగ్ హాస్టల్ , ఫిమేల్ నర్సింగ్ హాస్టల్ ఫర్ ఫిమేల్, నాన్ టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్ , నర్స్ స్ స్టాఫ్ క్వార్టర్స్, గెస్ట్ హౌసె ఫర్ ఆకడిమిక్, కిచెన్ కం డైనింగ్ హాల్, జిమ్నాసియం , తదితర 35 భవనాలు మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్మాణం జరుగుతుందన్నారు.
వైద్య కళాశాల నిర్మాణ పనుల పరిశీలనలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎం.డి. మురళీధర్ రెడ్డి, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ వినోద్ కుమార్, మెగా ప్రాజెక్టు ఇంజినీర్ జగదీష్, మచిలీపట్నం ఆర్డీవో ఐ. కిషోర్, తహసీల్దార్ సునీల్ బాబు, అర్బన్ బ్యాంకు మాజీ ఛైర్మెన్ బొర్రా విఠల్, శొంఠి ఫరీద్, కార్పొరేటర్ కాగిత జవహర్ (బున్నీ), పర్ణం సతీష్ , మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *