-ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే స్పందన కార్యక్రమ ప్రధాన ముఖ్యోద్దేశ్యం.
– కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో స్పందన హాల్ లో కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు ప్రజలనుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు స్పందనలో పెట్టుకున్న అర్జీలను మరొకసారి పునరావృతం కాకుండా తక్షణమే పరిష్కార దిశగా చర్యలు చేపట్టి ఆయా సమస్యలను పరిష్కరింప చేయాలని అధికారులకు ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో ప్రధానంగా రెవెన్యూకు సంబంధించి 42 అర్జీలు, పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్ శాఖకు సంబంధించి 9 అర్జీలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్భన్ డెవలప్మెంట్ కు సంబంధించి 9, ల్యాండ్ సర్వే కు సంబంధించి 8, పోలీస్ శాఖ 13, గృహనిర్మాణ శాఖ 4, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 5 అర్జీలు ఉన్నాయని వీటిని సంబంధిత శాఖల అధికారులు గడువు లోగా పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు.
స్పందనలో నమోదైన ప్రధాన అర్జీలు..
* నగరంలోని వార్డు సచివాలయం నెం 226 పరిధిలోని వార్డు నెంబర్ 34 లో నివసిస్తున్న షేక్ మొహిద్దీన్ తల్లి సబీమున్నీసా జిల్లా కలెక్టర్ కు అర్జీ సమర్పిస్తూ తన కుమార్తెకు అమ్మ ఒడి పధకానికి అనర్హురాలని ప్రభుత్వ రికార్డు లలో చూపిస్తుందని దీనివలన నా కుమార్తెకు అమ్మఒడికి సంబంధించిన సొమ్ము జమ కాలేదని అర్జీ ఇస్తూ ప్రభుత్వ లెక్కల ప్రకారం చూపిస్తున్న నా ప్రోపెర్టీ సరి కాదు. కావున నా కుమార్తె అమ్మ ఒడికి అర్హురాలు. కావున నా అర్జీని పరిశీలించి న్యాయం జరిపించాలని సబీమున్నీసా కోరారు.
* విజయవాడ అర్బన్ జోజి నగర్ కు చెందిన జి. బాలసాయి రాజా జిల్లా కలెక్టర్ కు అర్జీని సమర్పిస్తూ తనకున్న 39-1ఏ-22/ఏ లో 144 గజాల స్థలానికి సంబందించి నో అబ్జెక్షన్ ధ్రువపత్రం ఇప్పించాలని కోరారు.
*విజయవాడ రైల్వే కాలనీ బాను నగర్ కు చెందిన మీసాల లక్ష్మణ రావు కలెక్టర్ కు అర్జీ సమర్పిస్తూ తాను ప్రస్తుతం మానసిక వికలాంగ పెన్షన్ పై ఆధార పడి ఉన్నానని, తల్లి తండ్రుల సంరక్షణలో ఉండుట లేదని, తనకు కడుపులోని కాన్సర్ గడ్డ తో చాలా బాధ పడుతున్నానని ఎటువంటి ఆదాయం లేకపోవడంతో ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి ఆర్ధిక సహాయం అందించవల్సిందిగా కోరారు.
* జి. కొండూరు కుంటముక్కల గ్రామానికి చెందిన ఎన్. రమేష్ జిల్లా కలెక్టర్ కు అర్జీ సమర్పించుకుంటూ గతంలో గ్రామంలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేయడం జరిగిందని అది రిజిస్ట్రేషన్ పక్కాగా చేసుకోవడం జరిగిందని ఇప్పుడు తమ అవసార్ధం ఆ పొలాన్ని విక్రయించుకోదలిస్తే ఆ పొలం దేవాదాయ శాఖ భూముల్లో ఉన్నట్లుగా తెలుస్తోందని ఈ విషయంపై గత రెండున్నర సంవత్సరాలుగా దేవాదాయ శాఖ చుట్టూ తిరుగుతున్నామని, మేము చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండడం వలన పొలం అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని దయ చేసి ఈ సమస్యను పరిష్కరింప చేయాలనీ ఎన్. రమేష్ కోరారు.
* నందిగామ మండలం రామిరెడ్డి పల్లి గ్రామస్తురాలు తుమ్మల వెంకట్రావమ్మ జిల్లా కలెక్టర్ కు అర్జీని సమర్పిస్తూ తమకు రెవిన్యూ పరిధిలోని సర్వే నెం 94/1 అందు 3 ఎకరాల 3 సెంట్లు వ్యవసాయ భూమి ఉన్నదని ఆభూమికి గాను వెబ్ ల్యాండ్ నెం 6014 గా, అడంగల్ పసలి 1420 నందు అనుభవదారునిగా నమోదు అయి ఉన్నదని దీనిని వర్షాదారంతో 25 సంవత్సరాల నుండి మామిడి సాగు చేస్తున్నానని నందిగామ తహసీల్దార్ వారు తమకు అడంగల్ ఇచ్చి ఉన్నారని కావున నాకు ప్రభుత్వ రెవిన్యూ లో వెబ్ ల్యాండ్ ఆన్ లైన్ అడంగల్ రావడం లేదని, దీని వలన ప్రభుత్వ పధకాలు, సబ్సిడీ, బోరు బావి తదితరాలు రావడం లేదని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వ సహాయం అందడం లేదని కావున నాకు ఆన్ లైన్ అడంగల్ పహానీ, పాస్ బుక్ మంజూరు చేయాలని కలెక్టర్ ను ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్ అజేయ్, డి ఆర్ ఓ కె. మోహన్ కుమార్, జడ్.పి. సి.ఇ.ఓ. సూర్య ప్రకాష్, రెవిన్యూ, హోసింగ్, పంచాయతీ రాజ్, మునిసిపల్ కార్పొరేషన్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.