-ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే ఆన్ లైన్ టికెట్ లభ్యం
-ఏపీఎఫ్ డీసీ పోర్టల్ యువర్ స్క్రీన్స్ ద్వారా బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తి
-యువర్ స్క్రీన్స్ లో టికెట్ బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీల భారముండదు
-ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ విధానం వల్ల థియేటర్స్ కి ఉన్న గత ఒప్పందాలు రద్దు కావు.
-ఏపీ ఎఫ్.డీ.సీ. ఎం.డీ శ్రీ.టి. విజయ్ కుమార్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇకపై ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే సినిమా టికెట్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయని చలన చిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తిపలికి ప్రజలకు తక్కువ ధరకే వినోదం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏపీ ఎఫ్ డీసీ పోర్టల్ ‘యువర్ స్క్రీన్స్’ ను తీసుకురానుందని, తద్వారా టికెట్ బుకింగ్ చేసుకుంటే ప్రేక్షకుడిపై ఎలాంటి అదనపు భారం పడకుండా దోపిడీకి చెక్ పడనుందని వెల్లడించారు. ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ విధానం వల్ల తాము నష్టపోతామని భావిస్తున్న థియేటర్ల యాజమాన్యం, ఎగ్జిబిటర్లు వెల్లిబుచ్చిన సందేహాలను నివృత్తి చేస్తూ బుధవారం విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నాలుగవ అంతస్థులోని ఎఫ్ డీసీ కార్యాలయం నుండి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇకపై ఏదైనా కొత్త సినిమా విడుదలైందంటే ప్రేక్షకులు జేబులు చిల్లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ ద్వారా తక్కువ ధరకే సినిమా టికెట్ బుక్ చేసుకుని ఇంటిల్లిపాది సంతోషంగా వినోదం ఆస్వాదించవచ్చన్నారు. ఇతర పోర్టల్ లలో టికెట్ బుకింగ్ చేసుకుంటే టికెట్ పై అదనంగా రూ.20 నుండి రూ.25 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుడిపై భారం పడుతుందని గ్రహించిన ప్రభుత్వం వాటికి అడ్డుకట్ట వేసే దిశగా ఆలోచించి యువర్ స్క్రీన్స్ ను అందుబాటులోకి తేవడం ద్వారా ప్లాట్ ఫామ్ ఛార్జీగా టికెట్ పై కేవలం రూ.1.95 శాతం మాత్రమే అంటే సున్నా ఛార్జీ పడుతుందన్నారు. ఆ లెక్కన ఒక్కో టికెట్ పై ప్రేక్షకుడికి సుమారు రూ.25 భారం తగ్గుతుందన్నారు.
ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి సినీ ప్రముఖులు కొందరు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టమని కోరారనే విషయం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ 24 క్రాప్ట్స్ ప్రతినిధులతో గతేడాది సెప్టెంబర్ లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, సర్వీస్ ప్రొవైడర్లు తదితరులతో నాటి మంత్రి పలుదఫాలుగా మీటింగ్ లు నిర్వహించి అభిప్రాయాలు సేకరించిన అనంతరం ప్రభుత్వమే ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి శ్రీకారం చుట్టిందని వివరించారు.
ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్ లతో థియేటర్ల వారికి ప్రత్యేక ఏర్పాటు ఉందని చెబుతూనే అగ్రిమెంట్ ఎవరైతే చేసుకున్నారో అప్పటికి ప్రభుత్వ ఎగ్జిస్టింగ్ జీవో ప్రకారం కేవలం 50 శాతం సీట్లు మాత్రమే ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో థియేటర్ల వారికి తమ డబ్బు తమకు సక్రమంగా రాదనే అపోహలు అవసరం లేదన్నారు. థియేటర్లకు రోజువారీగా అంటే ఏ రోజుకు ఆ రోజే డబ్బు బదలాయింపు జరుగుతుందని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నామన్న విషయం గుర్తు చేశారు. ఇప్పటికే బుకింగ్ సర్వీస్ అందిస్తున్న అగ్రిగేటర్స్ కి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించిన నాటికి అంటే 17.12.2021 నాటికి ఉన్న అగ్రిమెంట్లను కొనసాగిస్తూ ఎంవోయూలో స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు. థియేటర్ యాజమాన్యాల కోరిక మేరకే ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 13 విడుదల చేసిన విషయం గుర్తుచేశారు. కేవలం ఒకదానికి మాత్రమే అవకాశం ఉండాలి అంటే మాత్రం అది మోనోపోలీ ప్రాక్టీస్ కిందకు వస్తుందని ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధ సంస్థ అయిన Competition Commission of India… ఇటీవలే ఒక ఆన్ లైన్ పోర్టల్ ను ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ విధానం వల్ల థియేటర్స్ కి ఉన్న గత ఒప్పందాలు రద్దవుతాయన్న అపోహలు అక్కర్లేదన్నారు. పాత ఒప్పందాలు యథావిధిగానే కొనసాగుతాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్ లతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన యువర్ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్ బుక్ చేసుకునే అవకాశం థియేటర్లు కల్పించాలన్నారు. ఇందుకు అవసరమైన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను కూడా ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుడు రేటుతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పోర్టల్ నుండి టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అదనపు ఛార్జీల భారం లేకుండా తక్కువ ధరకే టికెట్ కావాలనుకుంటే అటువంటి వారిని యువర్ స్క్రీన్స్ పోర్టల్ ఆహ్వానిస్తుందన్నారు. చివరగా గతంలో ఉన్న ఒప్పందాన్ని అలాగే ఉంచి ప్రేక్షకుడికి లాభం కలిగేలా ఏపీఎఫ్ డీసీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
ప్రభుత్వం టికెట్ రేటును నిర్ధేశించడం వల్ల రోజువారీగా ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి, ఎంత రేటుకి అమ్ముడయ్యాయి, ఎంత జీఎస్టీ వసూలైందనే వివరాలు తెలుస్తాయన్నారు. తద్వారా పన్ను ఎగవేతకు అవకాశం ఉండదని, ప్రేక్షకుడికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ అందుబాటులోకి వస్తుందన్నారు.