-ఎమ్మెల్యేవెల్లంపల్లికి జనసేన అధికార ప్రతినిధి ఐజా హెచ్చరిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కి జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయా సుద్దిన్ ఐజా హెచ్చరించారు. ఆదివారం భవానిపురం లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక అర్హత వె ల్లంపల్లి కి లేదని అన్నారు. వెల్లంపల్లి నోటికొచ్చినట్టు మాట్లాడితే వెల్లంపల్లి ఇంటిని ముట్టడించేందుకు జనసైనికులు, ముస్లిం మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.గత మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యేగా వెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెల్లంపల్లి ని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారని, వాటికి సమాధానం చెప్పలేక వెల్లంపల్లి పారిపోతున్నారని అన్నారు. వెల్లంపల్లి ను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమంగా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారంటేనే వైసిపి నాయకులు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుందని ఆయన అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ముస్లిం మైనారిటీ లు గణనీయ సంఖ్యలో ఉన్నారని, రేపు గెలుపు ఓటములను నిర్ణయించేది వారేనని స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీ లంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారని ఆయన చెప్పారు. సమావేశంలో జనసేన నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మోబీనా, జనసేన నగర కార్యదర్శి సయ్యద్ అబ్దుల్ నజీబ్, మైనార్టీ నాయకులు షేక్ మున్నా, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.