-ఏపీ మోడల్ స్కూల్స్ లో ఇంధన సామర్ధ్య చర్యలు
-కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ బీఈఈ ప్రవేశ పెట్టిన స్పీడ్ పధకం పేరుతో ఇంధన సామర్ధ్య ఉపకరణాలు
-7 జిల్లాలో 85 మోడల్ స్కూల్స్, వసతి గృహాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేసిన ఏపీ ఎస్ఈసిఎం.
-51 పాఠశాలల్లో 3.79 లక్షల యూనిట్లు ఆదా.. ఫలితంగా రూ 23 లక్షలు ఆదా
-బీఈఈ సౌజన్యంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలనీ ఏపీఎస్ఈసిఎం లక్ష్యం
-విద్యార్ధులకు అవగాహన కల్పించండం ధ్యేయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసిఎం) ద్వారా మోడల్ స్కూల్స్లో అమలు చేస్తున్న ఎనర్జీ ఎఫిసిఎన్సీ అప్లయెన్సెస్ పైలట్ ప్రాజెక్ట్ సత్ ఫలితాలనిస్తోంది. ఇంధన సామర్ధ్య చర్యలు పాటించడం ద్వారా ఈ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉన్న పాఠశాలల్లో గణనీయమైన విద్యుత్ పొదుపు అవుతోందని అధికారులు నిర్ధారించారు. అంతేకాకుండా దీనివల్ల విద్యార్దులకు ఇంధన సామర్థ్యంపై అవగాహన కల్పించేందుకు కూడా ఇది సహాయపడుతోంది.
రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ఇంధన పొదుపు , ఇంధన సామర్థ్య కార్యకలాపాలను ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా ఏపీఎస్ఈసీఎం విద్యా శాఖ ఆధ్వర్యంలో ఉన్న పాఠశాలలు, వాటి అనుసంధాన వసతి గృహాల్లో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేసింది. అదే సమయంలో విద్యార్థులలో ఇంధన పొదుపు పై అవగాహనా పెంపొందించేలా చర్యలు తీసుకుంటుంది.
ఏపీఎస్ఈసీఎం మోడల్ స్కూల్స్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసీఎంసీ ప్రవేశ పెట్టిన స్పీడ్ (స్టేట్ పార్టనర్షిప్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెమోన్స్ట్రేషన్) ప్రోగ్రాం కింద ఇంధన సామర్థ్య ఉపకరణాల పైలట్ ప్రాజెక్ట్ను అమలు చేస్తోంది. ఇది ఇంధన సామర్థ్య పరికరాలు మరియు సాంకేతికతల ప్రభావాన్నిఅధ్యయనం చేసేందుకు మోడల్ పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ను అమలు చేస్తోంది . రాష్ర్టంలో పాఠశాలలు చాలా ఎక్కువగా ఉన్నందున విద్యార్థి లోకానికి ఇంధన సంరక్షణపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది.
ఏపీఎస్ఈసిఎంకు నిరంతరం సహకారాలు అందించినందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీకి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా పాఠశాలల్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రోగ్రామ్ అమలుకు సహకారం అందించిన పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో ఏపీఎస్ఈసీఎం(ఇంధన శాఖ) బీఈఈ సౌజన్యంతో ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ఇంధన సామర్థ్య చర్యలను చేపట్టాల నే లక్ష్యంతో ఉందని చెప్పారు.
ఇంధన సామర్ధ్య చర్యలను వేగవంతంగా, సులువుగా అమలుచేయాలంటే అది కేవలం విద్యార్ధుల ద్వారా అయితేనే మంచి ఫలితాలిస్తుందని భావించిన ఏపీఎస్ఈసీఎం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థలలో అదే తరహాలో ఇంధన సామర్ధ్య చర్యలను ప్రోత్సహించడం, అమలు చేయడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపకరిస్తోంది.
ఇందులో భాగంగా ఏపీఎస్ఈసీఎం రాష్ర్టంలోని వివిధ జిల్లాల్లోని 85 మోడల్ స్కూళ్లలో పాత లేదా వాడుకలో లేని ఉపకరణాల స్థానంలో ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు మరియు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు వంటి స్టార్ రేటెడ్ ఎలక్ట్రికల్ ఉపకరణాలను అందించింది.
మొత్తం 85 పాఠశాలల్లోని 51 మోడల్ స్కూల్స్లో ఇంపాక్ట్ అనాలిసిస్ స్టడీని శాస్త్రీయ పద్ధతిలో ఇంధన సామర్థ్య ఉపకరణాలు వాడటం వలన వాస్తవంగా విద్యుత్ పొదుపులో కలిగే ప్రభావాన్ని పరిశీలించారు. సంవత్సరానికి 3.79 లక్షల యూనిట్ల విద్యుత్ను దాదాపు 51 మోడల్ స్కూళ్లలో పాత ఉపకరణాల స్థానంలో ఇంధన సామర్ధ్య ఉపకరణాల వినియోగంతో ఆదాచేసినట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. దీనివల్ల రూ.23 లక్షలు ఆదా అయ్యాయని నిర్ధారించారు. ఈ అధ్యయనం ఆధారంగా 85 మోడల్ స్కూల్స్లో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా సంవత్సరానికి 6.31 లక్షల యూనిట్ల విద్యుత్ను ఆదా చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు ఏపీఎస్ఈసీఎం అధికారులు తెలిపారు.
ఇంధన సామర్థ్య ప్రయోజనాలను అందించే ప్రయత్నాల్లో భాగంగా గ్రామీణ నీటి సరఫరా పథకాలు, ఈహెచ్టీ సబ్స్టేషన్లు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం మొదలైన వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ స్పీడ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది.
పాఠశాలల్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రదర్శన ప్రాజెక్ట్ ద్వారా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న అన్ని పాత విద్యుత్ ఉపకరాణాల స్థానంలో బీఈఈ- 5 స్టార్ రేటింగ్ ఉన్న ఎల్ఈడీ ఉపకరణాలతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో పాత ఫ్యాన్ల స్థానంలో సూపర్ ఎఫిషియెంట్ ఫ్యాన్లను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరుల్లో ఉన్న 85 మోడల్ స్కూళ్లు, పాఠశాల విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న వసతి గృహాల్లో నిరుపయోగమైన బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల స్థానంలో ఎల్ఈడీ బల్బులు (9 వాట్స్), ఎల్ఈడీ ట్యూబ్లు (20 వాట్స్), ఎనర్జీ ఎఫెక్టివ్ ఫ్యాన్లు (50 వాట్స్) ఏర్పాటు చేశారు. రూ. 99 లక్షల పెట్టుబడితో ఏర్పాటుచేసిన వీటి ఖర్చును 2 సంవత్సరాల 3 నెలల కాల వ్యవధిలో తిరిగి పొందవచ్చని ఏపీఎస్ఈసీఎం అధికారులు పేర్కొంటున్నారు. బల్బులు, ట్యూబ్ లైట్లు మరియు ఫ్యాన్లతో పోలిస్తే LED బల్బ్ దాదాపు 51 వాట్లను, LED ట్యూబ్ లైట్ 32 వాట్లను మరియు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్ 25 వాట్లను ఆదా చేస్తుంది.
ఎనర్జీ ఎఫిషియెన్సీ అనేది విద్యుత్ని ఆదా చేయడానికి మరియు తక్కువ ఖర్చుతో కూడిన మార్గంలో విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి చౌకైన, సులభమైన మార్గం. ఇది ఇంధన భద్రతను సాధించడానికి, నాణ్యమైన విద్యుత్ సరఫరాను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాష్ట్రంలోని ఉన్న ప్రతి వినియోగదారుడు, వారి రోజువారీ జీవితంలో ఇంధన సామర్థ్యాన్ని అవలంబించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం బీఈఈ మద్దతుతో ఎల్ఈడీ బల్బులు, వీధి దీపాలు మొదలైన వాటితో సహా అనేక ఇంధన సామర్థ్య కార్యక్రమాన్ని అమలు చేసింది .
ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రంగాలలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇది చివరికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి, పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
ఏపీఎస్ఈసీఎం పాఠశాల విద్యా శాఖ సహాయంతో ఎనర్జీ క్లబ్లను ఏర్పాటు చేస్తోంది. డిబేట్లు, క్విజ్ ప్రోగ్రామ్లు మొదలైనవాటిని నిర్వహించడం ద్వారా పాఠశాల విద్యార్థులలో అవగాహనను కల్పిస్తోంది. తద్వారా ఇంధన సామర్థ్య ఉద్యమంలో యువతరాన్ని భాగస్వామ్యులుగా చేసి వారిని మరింతగా ప్రోత్సహిస్తుంది. ఈ ఎనర్జీ క్లబ్లు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి, వీరు తమ మిత్రులు, పొరుగింటి వారు, ఇతర కుటుంబాలు మరియు సమాజాన్ని వినూత్న చర్యల ద్వారా ఇంధన పొదుపు దిశగా చైతన్యవంతులను చేస్తారు.
రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ఎనర్జీ క్లబ్లను ఏర్పాటు చేయడానికి నమోదు చేసుకున్నాయి. ఏపీఎస్ఈసీఎం, బీఈఈ మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో అనేక రకాల ఎనర్జీ క్లబ్లను నెలకొల్పేందుకు , ఎనర్జీ క్లబ్ కార్యక్రమాన్ని అత్యంత ప్రభావవంతమైన మార్గంలో విజయవంతం చేయడానికి ఆసక్తిగా ఉంది.
Prajavartha Online Telugu News