-భగీరథ ప్రయత్నంలో ముందడుగు
-రూ.215 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం మంజూరుకు ఎమ్మెల్యే రాజా వినతి
-సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కుళాయిల ద్వారా గోదావరి నీరు అందించాలనే భగీరథ ప్రయత్నంలో భాగంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బుధవారం మరో అడుగు ముందుకు వేశారు. ఇందులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రూ.215 కోట్లతో భారీ మంచినీటి పథకం (వాటర్ గ్రిడ్) మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు.
బుధవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞాపనలు అందించారు.
గోదావరి నది చెంతనే ఉన్నా, అత్యధికంగా బోరు నీటిపై ఆధారపడుతూ, దాహార్తితో అలమటిస్తున్న అన్ని గ్రామాలకూ పుష్కలంగా గోదావరి జలాలు అందించడానికి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషిచేస్తున్నారు. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇప్పటికే సుమారు రూ.65 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పైపులైన్ల ద్వారా మంచినీటి సరఫరాకు వీలుగా పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.
కాగా మొత్తం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పైపులైన్ల ద్వారా గోదావరి నీరు అందించడానికి వాటర్ గ్రిడ్ పథకానికి ఎమ్మెల్యే రాజా రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా గోదావరి నుంచి నీటిని లిప్టు చేసి, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని మంచినీటి చెరువులకు పంపిణీచేయడమే వాటర్ గ్రిడ్ పథకం ముఖ్య ఉద్దేశం. ఇలా చెరువులకు సరఫరా చేసిన గోదావరి నీటిని శుద్ధిచేసి, తాగునీటిగా కుళాయిల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తారు ఇందుకు కాను రూ.215 కోట్ల వ్యయం కాగల పథకానికి రూపకల్పనచేశారు. ఈ వాటర్ గ్రిడ్ పథకం సాధ్యమైనంత త్వరగా మంజూరుచేయాలని ఎమ్మెల్యే రాజా ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.
సీతానగరం పీహెచ్ సీ సీహెచ్ సీగా అప్ గ్రేడ్ చేయాలి
నియోజకవర్గంలోని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్ సి) ను 30 పడకల సామర్ధ్యంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్ సి)గా అప్ గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. అలాగే సీహెచ్ సీ కి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది నియామకాలు జరపాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
కోరుకొండలో భూముల రిజిస్ర్టేషన్ సమస్య తొలగించాలి
కోరుకొండ మండలంలో భూముల రిజిస్ట్రేషన్ విషయమై నెలకొన్న సమస్యను సత్వరమే తీర్చాలని ఎమ్మెల్యే రాజా ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. ఈ గ్రామంలోని వందలాది ఎకరాలు నిషేధిత జాబితాలో చేరిపోవడంతో ఎంతో కాలంగా రిజిస్ర్టేషన్లు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
4వేల ఎకరాల భూమికి నీటి ఎద్దడి తీర్చాలి
నియోజకవర్గంలోని గాదరాడ, నరసాపురం, కణుపూరు, రాజవరం గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ఒక ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలని ఎమ్మెల్యే రాజా ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
నియోజకవర్గంలో గృహ నిర్మాణ పథకంలో భాగంగా జరిపిన భూసేకరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పరిహారం బిల్లులు తక్షణం చెల్లింఛాలని ఎమ్మెల్యే రాజా విజ్ఞప్తిచేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
శ్రీరంగపట్నం కళాకారులకు పరిహారం
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన, తీవ్రంగా గాయపడిన శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన కళాకారుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తంఛేశారు. శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన 11మంది కళాకారులు విశాఖ జిల్లాలో ప్రదర్శనల నిమిత్తం వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో మృతిచెందిన కళాకారులు కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష వంతున పరిహారం చెల్లించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.
పేపరు మిల్లు కార్మికులకు న్యాయం చేయాలి
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే రాజా ముఖ్యమంత్రిని కోరారు. యాజమాన్యం, కొందరు కార్మిక సంఘ నేతల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న కార్మికులకు న్యాయం చేయాలని రాజా ముఖ్యమంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి, బొరుసు బద్రి ,కొండపల్లి దుర్గారావు, వాకా నరసింహారావు పేపర్ యూనియన్ ప్రెసిడెంట్ కస్సే రాజేష్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News