విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ హౌస్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సి.పి.ఎం. (హెచ్,ఆర్.డి.) సామ్బ్రాజ్యం అధ్యక్షత వహించారు. నేడు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమె వివరించారు. అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) పి.కృష్ణ మోహన్ మరియు ఎఫ్.ఏ.& సి.ఏ.ఓ. రాఘవ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధిలో మహిళలు తమవంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వహించారని తెలిపారు. అనంతరం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు,ఐ.పి.ఎస్. మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో మహిళలు తమ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ లో 5300 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారని అంటే 10% స్థానం మహిళలదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమని తెలిపారు.
మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా, అనాలోచితంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా బస్సుల్లో మహిళా ఉద్యోగులు వారి బాధ్యతలు సమర్ధవంతంగా, ధైర్యంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. సంస్థలో మహిళలు చాలా కష్టపడుతూ విధులు నిర్వర్తిస్తున్నారని కండక్టర్లుగా, ఇంచార్జ్ లుగా, కానిస్టేబుల్ గా, ఆఫీసుల్లో ఇలా అన్ని విభాగాల్లో సేవలందిస్తూ వారి ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. అన్ని రంగాలలోనూ వారి ఉనికిని చాటుకుని సాధికారత సాధించారన్నారు. ప్రధాన కార్యాలయంలోని మహిళలందరినీ ఒకే చోట చూస్తుంటే కన్నుల పండుగగా ఉందని, ఈ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం, వారి పట్ల మనమంతా కృతజ్ఞతా భావంతో మెలగాలన్నారు. సంస్థలోని మహిళలు చాలా ఓర్పు, సహనంతో విధులు నిర్వర్తించి సంస్థ ప్రగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళలు పురుషల కంటే ఏమీ తీసిపోరని నిరూపిస్తున్నారన్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు తర్వాత ఇంటి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ వారి యొక్క మనోబలంతో స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారన్నారు. సంస్థలో ప్రతిభ కనబరిచిన మహిళలను ఈ సందర్భంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) పి.కృష్ణ మోహన్, ఎఫ్.ఏ.& సి.ఏ.ఓ. రాఘవ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ (ఐ.టి.) సుధాకర్, విజిలెన్స్(ఏ.డి.) శోభామంజరి తదితరులు ప్రధాన కార్యాలయంలో పనిచేసే మహిళలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వారంతా ఎం.డి.గారి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హెడ్డాఫీస్ విభాగం మహిళా ఉద్యోగులందరూ పాల్గొన్నారు.