-మోయా మోయా వ్యాధితో పక్షవాతం బారినపడిన బాలుడికి విజయవంతంగా చికిత్స
-సంక్లిష్టమైన బైపాస్ సర్జరీతో మెదడుకు రక్త సరఫరా పునరుద్ధరణ
-చికిత్సానంతరం డిశ్చార్జయి కోలుకుంటున్న బాలుడు
-బ్రెయిన్ బైపాస్ సర్జరీలతో సహా పలు అత్యాధునిక చికిత్సలు అను ఇనిస్టిట్యూట్ లో అందుబాటులో ఉన్నాయని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సందీప్ తలారి వెల్లడి
-వైద్య బృందాన్ని అభినందించిన అను చైర్మన్ డాక్టర్ జి. రమేష్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య చికిత్సా రంగంలో అనేక అద్భుత విజయాలను సాధించిన అను ఇనిస్టిట్యూట్ వైద్యులు, తాజాగా మరో అత్యంత అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. మోయా మోయా అనే అరుదైన వ్యాధితో పక్షవాతం బారినపడిన 11 ఏళ్ల బాలుడి మెదడుకు బైపాస్ సర్జరీ నిర్వహించి, అతడిని కోలుకునేలా చేయగలిగారు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు శుక్రవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. మహారాణిపేటలోని అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ నందు జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సందీప్ తలారి మాట్లాడుతూ, “కాకినాడకు చెందిన 11 ఏళ్ల బాలుడికి పక్షవాతం రావడంతో, ఎడమ వైపు శరీర భాగాలు ప్రభావితమయ్యాయి. కాకినాడ, విశాఖలోని ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. మెరుగైన చికిత్స నిమిత్తం రోగిని అను ఇనిస్టిట్యూట్ లో చేర్పించారు. ఎంఆర్ఐ, ఎంఆర్ యాంజియోగ్రాం తదితర పరీక్షల అనంతరం, బాలుడు మోయా మోయా అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధి కారణంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు కుచించుకుపోతాయి. తత్ఫలితంగా మెదడుకు సక్రమంగా రక్త సరఫరా జరుగకపోవడంతో పక్షవాతం సంభవిస్తుంది. మెదడుకు రక్తాన్ని సక్రమంగా సరఫరా చేయడం ద్వారా మోయా మోయా వ్యాధిని నయం చేయవచ్చు. మెదడుకు డీఎస్ఏ నిర్వహించడం ద్వారా తొలుత మెదడు కుడిభాగానికి చికిత్స చేయాలని నిర్ణయించాం. న్యూరో సర్జన్ డాక్టర్ టి. విజయ్ కుమార్, క్రిటికల్ కేర్, అనస్థీషియా నిపుణులు డాక్టర్ కిషోర్, డాక్టర్ ఉర్నిల, డాక్టర్ దివ్య, డాక్టర్ శిరీష సహకారంతో మెదడుకు బైపాస్ సర్జరీ నిర్వహించాం. అత్యంత అరుదైన, అతి క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేయగలిగాం. సర్జరీ జరిగిన ఐదో రోజున బాలుడిని డిశ్చార్జి చేయగా, పక్షవాతం నుంచి నెమ్మదిగా కోలుకోగలుగుతున్నాడు” అన్నారు. మెదడు బైపాస్ సర్జరీలతో పాటు, అత్యంత అత్యాధునిక చికిత్సలు అను ఇనిస్టిట్యూట్ నందు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ సందీప్ తలారి తెలియజేశారు. ముంబయి, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో మాత్రమే లభించే అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అను ఇనిస్టిట్యూట్ ద్వారా ప్రజలకు చేరువ చేయగలిగామని ఆయన వివరించారు. దేశంలోనే అత్యంత అరుదైన కేసుగా పేర్కొనదగిన ఈ చికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన డాక్టర్ సందీప్ బృందాన్ని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో అను ఇనిస్టిట్యూట్ విశాఖపట్నం యూనిట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీలలిత, న్యూరో ఫిజీషియన్ డాక్టర్ ఎంజివి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News