– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ గోదాము భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. గురువారం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. అదనపు సీఈవో ఎం.ఎన్.హరెంధిర ప్రసాద్, సమన్వయ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల భద్రతకు సంబంధించి చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో గోదాము భద్రతకు చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్ల కొనసాగింపునకు ఎన్నికలు, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాటు జరక్కుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి నెల ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. గోదాము భద్రత పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఈసీఐ, సీఈవో సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ ఈవీఎం, వీవీప్యాట్ గోదాము తనిఖీ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఈవీఎం, వీవీప్యాట్ గోదాము సందర్శనలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.