– తాడిత, పీడిత ప్రజల బాగుకోసం ఆయన చిత్తశుద్ధితో పనిచేశారు.
– ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకూ అవిరళ కృషిచేశారు.
– తెలుగుజాతి, తెలుగు నేలకు ఆత్మబంధువుగా ఉన్నారు.
– ఆయన జీవితం నేటితరం రాజకీయ నాయకులకు ఓ పాఠం.
– రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు; గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారం కాదు.. సిద్ధాంతాలే ముఖ్యంగా పనిచేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు; గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే)లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి హాజరై సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, అంబటి రాంబాబు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సీతారాం ఏచూరి దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వ్యాప్తికి చేసిన పోరాటం, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేసిన కృషిని ఈ సందర్భంగా మంత్రివర్యులు గుర్తుచేసుకున్నారు.
సంస్మరణ సభలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని.. తాడిత, పీడిత ప్రజల బాగుకోసం సీతారాం ఏచూరి ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు. ఆయనతో నేరుగా అనుబంధం లేకపోయినా ఆయన గొప్పతనం గురించి చాలా విన్నానని తెలిపారు. ఇంతటి గొప్పవ్యక్తి అయిన సీతారాం ఏచూరి తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. జేఎన్‌యూలో విద్యార్థి సంఘ నేతగా పనిచేయడంతో పాటు కమ్యూనిజం బలోపేతానికి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పోరాటం చేశారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన చూపిన తెగువను గుర్తుచేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ తెలుగుజాతి, తెలుగు నేలకు ఆత్మబంధువుగా ఉన్నారని, రాష్ట్ర అభివృద్ధికి కృషిచేశారన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైన తర్వాత కూడా పార్లమెంటులో లేదా అవకాశం వచ్చిన ప్రతిచోటా తెలుగు రాష్ట్రాలకు అందాల్సిన వాటి గురించి తన గళాన్ని బలంగా వినిపించారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చినా ఆదుకునేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని.. పేదలు, తాడిత, పీడిత ప్రజల అభివృద్ధికోసం ఆయన జీవితాంతం కృషిచేశారన్నారు. పెట్టుబడుల ఉపసంహరణకు ఆయన వ్యతిరేకమని.. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం వినిపించారని తెలిపారు. అమెరికాతో అణు ఒప్పందం సమయంలో యూపీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం ముంచుకొస్తుందనే ఉద్దేశంతో అధికారాన్ని కూడా తృణప్రాయంగా భావించి బయటకొచ్చి తన వాదనను బలంగా వినిపించారన్నారు. సీతారాం ఏచూరి జీవితం ఈ తరం రాజకీయ నాయకులకు ఓ పాఠం కావాలని భావిస్తున్నట్లు మంత్రివర్యులు కొలుసు పార్థసారథి అన్నారు.