Breaking News

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి… : మంత్రి కొల్లు రవీంద్ర

పోతేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలను కోరారు. జిల్లాలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం అమలులో భాగంగా సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నం మండలం చినపోతేపల్లి గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణపై నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి పాల్గొన్నారు.

ఈ క్రమంలో సేకరించిన వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్ధాలను పరిశీలించారు. ఆయా వ్యర్ధాల సేకరణకు 10 మేజర్ పంచాయతీలలో ఏర్పాటు చేయనున్న కియోస్క్ సెంటర్లను మంత్రి కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ నేటి సమాజంలో మనిషి పుట్టుకతోనే ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెద్ద ఎత్తున పెరగడం, అదే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్ధాలు పేరుకుపోవడం సర్వసాధారణమైపోయిందని అన్నారు.

ప్రతి ఇంటిలోనూ టెలివిజన్లు, వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్లు, ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర గృహ వినియోగ ఎలక్ట్రానిక్ వస్తువులు కొంతకాలం వినియోగించి పక్కన పడేయటంతో పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు పేరుకుపోతున్నాయని, దీనితో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భవిష్యత్తు తరాల వారి జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యేందుకు అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు భూమిలో త్వరితగతిన కలిసిపోయే వస్తువులు కాకపోవడంతో పర్యావరణానికి ముప్పుగా పరిణమించి మానవుని ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్రభావాలను కలిగిస్తుందన్నారు.

ఈ అనర్థాలన్నిటి నుంచి ప్రకృతిని కాపాడేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్ధాలను రీసైక్లింగ్ చేపట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోనే తొలిసారిగా కృష్ణా జిల్లాలో ప్రతి ఇంటి నుంచి ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ క్రమంలో రోజువారి సాధారణ చెత్తను సేకరించే రీతిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించేందుకు ప్రస్తుతం కొన్ని పంచాయతీలలో కియోస్క్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో చెత్త నుండి కంపోస్ట్ ఎరువును తయారుచేసి పంచాయతీకి సంపద సమకూరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోతేపల్లి గ్రామంలో జువెలరీ పార్క్ కారణంగా భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, త్వరలో నీటి శుద్ధి ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని, డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 11 టన్నులకు పైగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించడానికి తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులను మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించేందుకు జిల్లాలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సాంకేతికతో కూడిన నూతన ఆవిష్కరణలు సంభవించినప్పుడు దానితోపాటు ప్రతికూల అంశాలు తయారవుతాయని, కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం తర్వాత కొంతకాలానికి పక్కన పడేయడంతో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు పేరుకుపోవడం రానున్న రోజుల్లో పెద్ద సమస్యగా తయారవుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణపై అనేక ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు ఉత్పత్తిదారుడే దాని రీసైక్లింగ్ బాధ్యతను తీసుకోవలసిన అవసరం ఉంటుందన్నారు. ఆ క్రమంలో ఆయా కంపెనీలు రీసైక్లింగ్ కోసం ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకొని రీసైక్లింగ్ ప్రక్రియను ప్రారంభించాయన్నారు. జిల్లాలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు సేకరణపై స్పందన బాగుందని, ఒక టన్నులోపు మాత్రమే వస్తుందన్న అంచనాలకు మించి ప్రస్తుతం 11.36 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సేకరించగలిగామని, ఇది జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రెటరీలు, పారిశుద్ధ్య కార్మికుల వల్లనే సాధ్యమైందని వారిని అభినందించారు. జిల్లాలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగేలా ప్రస్తుతం 10 మేజర్ పంచాయతీలలో కియోస్క సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో మొత్తం 497 గ్రామపంచాయతీలతో పాటు పట్టణ స్థానిక సంస్థలు మచిలీపట్నం, పెడన, గుడివాడ, ఉయ్యూరు, తాడిగడప మున్సిపాలిటీల నుంచి టెలివిజన్లు, కంప్యూటర్లు, కిచెన్ వినియోగ తదితర ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించామని, ఇప్పటివరకు గ్రామ పంచాయతీల నుంచి 9.65 టన్నులు, మున్సిపాలిటీల నుంచి 1.71 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించినట్లు జిల్లా పంచాయతీ అధికాణి జె అరుణ వివరించారు. ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణకు పోతేపల్లి, అవనిగడ్డ, బాపులపాడు, చల్లపల్లి, మల్లయ్యపాలెం, గుడ్లవల్లేరు, నాగాయలంక, పామర్రు, ఉంగుటూరు, పెదపారుపూడి వంటి పంచాయతీలలో ప్రస్తుతం కియోస్క్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించినందుకు గానూ హోమ్ ల్యాండ్ ఎన్విరో ఇంజనీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు జిల్లాకు ఎక్స్లెన్స్ సర్టిఫికెట్ను అందించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కన్నమనాయుడు, హోమ్ ల్యాండ్ ఎన్విరో ఇంజనీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి సుమన్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోపు సత్యం, కూటమి నాయకులు బండి రామకృష్ణ, కాటం మధు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *